srisailam, cotton barrage: కేంద్ర జలశక్తిశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న డ్రిప్ 2 (డ్యామ్‌ల పునరుద్ధరణ అభివృద్ధి పథకం) ప్రాజెక్టులో.. రాష్ట్రంలోని శ్రీశైలం జలాశయం, ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజిలను చేర్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులను కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని డ్యాం భద్రతా సమీక్ష కమిటీ బృందం వచ్చే వారం సందర్శించబోతోంది. కేంద్ర జలసంఘం విశ్రాంత ఛైర్మన్ పాండ్యా నేతృత్వంలో ఈ కమిటీ జనవరి 3, 4 తేదీల్లో శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి, అక్కడే సమావేశమవుతుంది. శ్రీశైలం డ్యాం భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించి చేపట్టాల్సిన పనులపై నివేదిక అందజేస్తుంది. 5, 6 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరంలో ఉన్న కాటన్ బ్యారేజిని కూడా సందర్శించనుంది. డ్రిప్-2లోకి ఈ ప్రాజెక్టులను చేర్చాలంటే డ్యాం భద్రతా కమిటీ సిఫార్సులు, నివేదిక ముఖ్యం.
31 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపినా..
కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయంతో ఈ పథకాన్ని చేపడుతోంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 70:30 నిష్పత్తిలో ఉంటుంది. ఈ పథకం కింద నిధులు పొందేందుకు తొలి దశలో రాష్ట్రంలోని 31 ప్రాజెక్టులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలోని అనేక మధ్య తరహా ప్రాజెక్టులను ఇందులో ప్రతిపాదించారు. తర్వాత దశలో 5 ప్రాజెక్టులకు పరిమితం చేసి డ్యాం భద్రతా కమిటీ సందర్శించి, నివేదికలు సమర్పించింది. అయితే అవి.. డ్రిప్ ప్రాజెక్టు విధివిధానాలకు అనుగుణంగా లేకపోవడంతో నిధులు పొందేందుకు అర్హత సాధించలేదు. అయిదు ప్రాజెక్టుల్లో రైవాడ జలాశయం ప్రాజెక్టు ఒక్కదానికే అర్హతలున్నట్లు పరిగణనలోకి తీసుకున్నారు. డ్రిప్ పథకం కింద నిధులు మంజూరు చేయాలంటే ప్రతిపాదిత ప్రాజెక్టు పనుల అంచనా వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం ముందే పాలనామోదం ఇవ్వాల్సి ఉంటుంది. అందులో మూడో వంతు మొత్తంతో టెండర్లు కూడా పిలిచి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ పథకంలో ఏ పనులు చేపట్టినా పునరావాసం, భూసేకరణ కింద నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండకూడదు. ప్రాజెక్టులో అదనపు భద్రతా ఏర్పాట్లు చేసుకునేందుకు ఉద్దేశించిన పనులు మాత్రమే ఇందులో చేర్చాలి. ఈ కోవలో పరిశీలించి తాజాగా శ్రీశైలం ప్రాజెక్టు, కాటన్ బ్యారేజిలను ప్రతిపాదించారు.
రూ.750 కోట్ల నిధులు!
కేంద్రం అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి రూ.750 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేంద్ర జలసంఘం పర్యవేక్షణలోనే అమలు చేస్తారు. తొలి దశలో రైవాడ, శ్రీశైలం, కాటన్ బ్యారేజి ప్రాజెక్టు పనులు చేపట్టాలనే ఆలోచనతో ఉన్నారు.
ఇదీ చదవండి: