Posts on Judges Case : హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో ముగ్గురిని రెండు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఈనెల 12న హైదరాబాద్‌లో ఈ ముగ్గురిని అరెస్టు చేసి అదేరోజు గుంటూరుకు తరలించారు. ఇక్కడ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా ముగ్గురికీ 14 రోజుల రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. నిందితులను మూడు రోజుల కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో 12వ తేదీన సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు మంగళవారం ఆదేశాలిచ్చింది. బుధ, గురువారాల్లో సీబీఐ ముగ్గురిని విచారించాల్సి ఉంది. అయితే అప్పటికే గోపాలకృష్ణ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విచారణకు ఆయన ఆరోగ్యం సహకరించదని వైద్యులు తెలిపినట్లు సమాచారం. జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కళానిధి గోపాలకృష్ణ ఆదివారం రాత్రి అనారోగ్యానికి గురికావడంతో జైలు అధికారులు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. క్రమంగా ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని వైద్యవర్గాలు తెలిపాయి. కళానిధి గోపాలకృష్ణ ఆరోగ్యపరిస్థితిపై బుధవారం సీబీఐ అధికారులు జీజీహెచ్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి : HC ON VIVEKA MURDER CASE: దస్తగిరి సాక్ష్యం తప్పనిసరి