Amaravati municipality: 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలనే వైకాపా సర్కార్ ప్రయత్నాలకు రాజధాని గ్రామాల్లో అడుగడుగునా తిరస్కారమే ఎదురవుతోంది. అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో సోమవారం మూడు గ్రామాలు అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటును వ్యతిరేకించగా... తాజాగా మరో మూడు గ్రామాలు వారితో జతకలిశాయి. బోరుపాలెంలో జరిగిన గ్రామసభలో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఊరంతా గళమెత్తింది. గ్రామసభలో అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. రాజధాని ప్రాంతంతో ఆటలాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలంటూ నిలదీశారు. చివరికి అధికారులు ఓటింగ్ నిర్వహించగా.... పురపాలిక కావాలని కేవలం ఇద్దరే కోరారు. మిగతా జనమంతా ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.
ఇక దొండపాడు గ్రామస్థులు కూడా అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటును ముక్తకంఠంతో తిరస్కరించారు. ప్రభుత్వ ప్రతిపాదనకు అనుకూలంగా ఒక్కరూ ఓటేయలేదు. సీఆర్డీఏ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలోనూ గ్రామస్థులు మున్సిపాలిటీ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అధికారులు నిర్వహించిన గ్రామ సభలో... మున్సిపాలిటీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఇవీ చదవండి: