తెలంగాణలోని నాగార్జునసాగర్‌లో మళ్లీ గులాబీ జెండానే ఎగురవేయాలనే లక్ష్యంతో.. తెరాస జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్ గౌడ్.. అనుముల మండలం పాలెం సహా వివిధ గ్రామాలు చుట్టివచ్చారు. వికలాంగుల సంఘాలతో హాలియాలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ నెల 14న జరిగే కేసీఆర్ సభ ఏర్పాట్లను.. తలసానితోపాటు ఆ పార్టీ నేతలు పరిశీలించారు.
జానారెడ్డికి ఓటు వేస్తే వృథాయే తప్ప ఉపయోగం ఉండదని.. అధికార పార్టీని గెలిపిస్తే అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని ఓటర్లకు వివరించారు. కేసీఆర్ శంకుస్థాపన చేసిన నెల్లికల్ ఎత్తిపోతల పథకాలను ఏడాదిన్నర లోపు పూర్తి చేయకపోతే.. తన పదవికి రాజీనామా చేస్తానని నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఇంఛార్జిగా ఉన్న తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
తెరాసకు దీటుగా ముఖ్యనేతలతో కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. జానారెడ్డిని గెలిపించాలంటూ తిరుమలగిరి, త్రిపురారం మండలాల్లో రేవంత్ రెడ్డి ఓట్లు అడిగారు. పెద్దవూర మండలం సంగారం, సిరసనగండ్లలో.. ములుగు ఎమ్మెల్యే సీతక్క పర్యటించి ఓట్లు అడిగారు. గుర్రంపోడు మండలంలోని పలు గ్రామాల్లో.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేశారు.
తెలంగాణ సర్కారుపై ధాటిగా విమర్శలు గుప్పిస్తూ భాజపా ఓటర్ల చెంతకు వెళ్తోంది. తిరుమలగిరి మండలం నెల్లికల్, పిల్లిగుండ్ల తండా, తిమ్మాయిపాలెంతోపాటు త్రిపురారం మండలంలో.. భాజపా అభ్యర్థి రవికుమార్ తరఫున విజయశాంతి ప్రచారం నిర్వహించారు. గుర్రంపోడు మండల కేంద్రం సహా కొప్పోలు, ఒద్దిరెడ్డిగూడెం, పెద్దవూర మండలంలోని వివిధ గ్రామాల్లో భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. తెరాస అధికారం చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి శూన్యమని విమర్శించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతు తెలుపుతున్నట్లు వామపక్షాలు ప్రకటించాయి.
ఇదీ చదవండి: