ఆర్టీసీ విలీనం, తెల్లరేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘాలు సచివాలయంలో సమావేశమయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై త్వరితగతిన విధి విధానాలను రూపొదించాలని మంత్రివర్గ ఉపసంఘం.. నిపుణుల కమిటీని ఆదేశించింది. ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, కొడాలి నాని, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి, ఆర్టీసీఎండీ సురేంద్రబాబు హాజరయ్యారు.
తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా అంశంపై కూడా మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. మంత్రులు బుగ్గన, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పౌరసరఫరాల శాఖ అధికారులతో ఈ అంశంపై చర్చించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా సన్నబియ్యం సరఫరా చేసే అవకాశముందని అధికారులు మంత్రులకు వివరించారు. ప్రభుత్వం వద్ద బియ్యం నిల్వలు 15 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయని స్పష్టం చేశారు. సన్నబియ్యం సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఓ సంచిని రూపొందించిందని తెలిపారు. మూడు కొలతల్లో సంచిని రూపకల్పన చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి :