తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా.. జిల్లా కలెక్టరేట్‌ల ముందు భాజపా, జనసేన ఆందోళనలప నిర్వహించింది. ఈ ఘటనకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. ఇప్పటివరకు దేవాలయాలపై జరిగిన అన్ని సంఘటనలపై సీబీఐ దర్యాప్తు వేయాలని డిమాండ్ చేశారు.
ఘటనకు కారణమైన వారిని శిక్షించే వరకూ ఉద్యమం ఆగదంటూ.. దుగ్గిరాలలో భాజపా, వీహెచ్పీ ఆధ్వర్యంలో నిరసన చేశారు. అంతర్వేది ఘటనలో రాష్ట్రప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన ఉద్యమకారులను విడుదల చేయాలంటూ.. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అంతర్వేది ఘటనపై ప్రశ్నించే హిందువులను అరెస్టు చేయడం అన్యాయమని.. రాష్ట్రప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తుందని.. విజయనగరం కలెక్టరేట్ వద్ద భాజపా, జనసేన నాయకులు సంయుక్తంగా ఆందోళనకు దిగారు. హిందూ మతాల ఐఖ్యత వర్ధిల్లాలంటూ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ముందు భాజపా నిరసన చేపట్టింది. ఏడాదిన్నర కాలంలో హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా కనీస చర్యలు చేపట్టలేదని తిరుపతి, కర్నూలు, అనంతపురం కలెక్టరేట్‌ల ముందు భాజపా, జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి: సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కన్నుమూత