ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతి అనే అంశంపై కట్టుబడి ఉన్నామని భాజపా ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. శుక్రవారం దిల్లీలో ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థలపై పార్టీకి ఉన్న గౌరవం కారణంగా గవర్నర్ నిర్ణయంపై రాజకీయ వ్యాఖ్యలు సముచితం కాదని అన్నారు. అయితే మూడు రాజధానుల అంశంపై అన్ని పార్టీలు ఆలోచన చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. గవర్నర్ అనేది రాజ్యాంగ వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కాదని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలను విభేదిస్తున్నట్లు తెలిపారు. మూడు రాజధానులు వైకాపా ప్రభుత్వ నిర్ణయమన్నారు.
అమరావతి కోసం అసెంబ్లీలో ఇదివరకే స్పష్టంగా మద్దతిచ్చామన్నారు. అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం అమలుచేయాలని డిమాండు చేస్తున్నామన్నారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆకాంక్షించారు. గత ప్రభుత్వం అడిగితే కర్నూలులో హైకోర్టు వచ్చి ఉండేదని పేర్కొన్నారు. కోర్టు ఉన్నంత మాత్రాన ఆ నగరం రాజధాని అయిపోదని జీవీఎల్ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో అలహాబాద్, రాజస్థాన్‌లో జోథ్‌పుర్, మధ్యప్రదేశ్‌లో జబల్‌పుర్‌ల్లో హైకోర్టులు ఉన్నాయని, ఆ ప్రాంతాలేవీ ఆయా రాష్ట్రాల రాజధానులు కావని గుర్తుంచుకోవాలన్నారు. అమరావతి రైతులకు భరోసానివ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
ఇదీచదవండి