మూసీకి మునుపెన్నడూ లేనంత భారీగా వరద వచ్చింది. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రాజెక్టు చరిత్రలోనే మొదటిసారిగా 2.36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు ఇంజినీర్లు తెలిపారు. 1963లో మూసీపై ప్రాజెక్టు నిర్మించగా, 1983లో అత్యధికంగా 2.26 లక్షల క్యూసెక్కులు వరద వచ్చింది. గత ఏడాది 40 వేల క్యూసెక్కులు వస్తేనే గేట్ల నిర్వహణలో చాలా ఇబ్బందులు వచ్చాయి. గత రెండురోజుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల కురిసిన భారీ వర్షాలు, ఆలేరు వాగుకు వచ్చిన వరదతో మూసీ ఉప్పొంగింది. దీనికితోడు బుధవారం హిమాయత్‌సాగర్ జలాశయం 13 గేట్లను ఎత్తడంతో మూసీలోకి వరద వచ్చి చేరింది. 4.46 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, 647 అడుగుల వరకు నీటిని నిల్వ చేశారు.
ఎత్తలేని గేట్లు ఏడు..
మూసీ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 30 గేట్లను అమర్చారు. నిర్వహణ ఇబ్బందిగా మారుతోందని ప్రభుత్వం 1990లో 10 గేట్లను కాంక్రీటుతో మూసేసింది. ప్రస్తుతం వరద పెరగడంతో అతి కష్టం మీద 13 గేట్లను ఎత్తి నీటిని వదిలారు. నిర్వహణ సమస్యల వల్ల ఏడు గేట్లు ఎత్తడానికి అసలు అవకాశమే లేకుండాపోయింది. భారీ వరదతో డ్యాంకు ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమైంది. చీఫ్ ఇంజినీర్ నరసింహ, ఎస్‌ఈ రమేష్ తదితరులతో మంత్రి జగదీశ్‌రెడ్డి ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహించి సూర్యాపేట జిల్లాలోని రత్నాపేరం వద్ద గండి పెట్టి దిగువకు నీటిని వదలాలని ఆదేశించారు. దీనికి తగ్గట్లుగా దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కొన్ని పొలాలు నీట మునిగాయి. మూసీ పరీవాహక ప్రాంతంలో పలు చోట్ల 24 గంటల్లో 20 నుంచి 25 సెం.మీ వరకు వర్షపాతం నమోదైంది. దీంతో మూసీకి ఇరువైపులా అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.
కృష్ణా, గోదావరి నదులకు కొనసాగుతున్న వరద
మరోవైపు కృష్ణా, గోదావరి నదుల్లో వరద కొనసాగుతోంది. కృష్ణాలో అత్యధికంగా శ్రీశైలానికి బుధవారం 3.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. బుధవారం ఉదయం నుంచి జూరాల జలాశయంలోకి 2,33,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో 37 క్రస్ట్ గేట్లు ఎత్తి 2,50,350 క్యూసెక్కులు, జలవిద్యుదుత్పత్తి ద్వారా 21,631 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.
ఇవీచూడండి: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం