తెలంగాణ రాజధానిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసీయూ పడకలన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి. కొత్తవారిని చేర్చుకోవాలంటే ఒకటి రెండు రోజులు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు మూడు రోజుల్లో ఆక్సిజన్ పడకలు కూడా నిండిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో విషమ పరిస్థితుల్లో వచ్చే వారికి ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ప్రభుత్వ వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్న కొవిడ్ పడకలన్నీ దాదాపుగా నిండిపోయాయి. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో సామర్థ్యానికి మించి 50 మంది రోగులను తీసుకుని అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్యశాలల్లోని ఐసీయూ, ఆక్సిజన్ పడకలకు పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడింది.
ఖాళీ అయితేనే మరొకరికి అవకాశం
గాంధీలో ఉన్న 619 ఐసీయూ పడకలు గురువారం రాత్రి నిండిపోయాయి. మరో 600 ఆక్సిజన్ పడకల్లో చాలావరకు భర్తీ అయ్యాయి. ఎవరైనా చనిపోతేనో, కోలుకుని ఖాళీ అయితేనో ఐసీయూలో కొత్తగా రోగులను చేర్చుకునే పరిస్థితి తలెత్తింది.
కొద్దిగా కోలుకున్న వారిని ఆక్సిజన్ పడకల్లోకి మార్చి కొత్తవారిని చేర్చుకుంటున్నామని, ప్రమాదకర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు ఏదో విధంగా వైద్యం అందించడానికి ప్రయత్నిస్తున్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. గాంధీకి రోజూ... ఇతర ఆస్పత్రుల నుంచి 200 మంది రోగులు వస్తున్నారు. చాలామంది ఆసుపత్రి ఆవరణలో గంటలకొద్దీ అంబులెన్సుల్లోనే ఉండాల్సివస్తోంది. ‘కొంతమంది రోగులను సర్దుబాటు చేయడానికి ఉండిపోవాల్సి రావడంతో బుధవారం రాత్రి రెండు గంటలు మాత్రమే నిద్రపోయాను’ అని గాంధీ సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు.
ఏ ఆసుపత్రిలో ఎలా?
కొవిడ్ ఆసుపత్రి టిమ్స్‌లో వెయ్యిపడకలు ఉండగా 137 ఐసీయూ వసతి కలిగినవి. వీటిలో గురువారం రాత్రి వరకు 100 మంది చేరారు. శుక్రవారం సాయంత్రానికి మిగిలినవి నిండిపోయే అవకాశం ఉంది. ఈ ఆసుపత్రిలో 843 ఆక్సిజన్ బెడ్లు ఉండగా సగానికి పైగా భర్తీ అయ్యాయి. ఛాతీ ఆసుపత్రిలో 124 వెంటిలేటర్ పడకలు నిండిపోయాయి. కింగ్‌కోఠి ఆసుపత్రిలో 50 ఐసీయూ పడకలుంటే 45 మంది చికిత్స పొందుతున్నారు. 200 ఆక్సిజన్ పడకలకు గాను 180 నిండాయి. ఫీవర్ ఆసుపత్రిలో వంద ఆక్సిజన్ పడకలుంటే ప్రస్తుతానికి 8 మంది రోగులు ఉన్నారు. కింగ్‌కోఠి ఆసుపత్రికి వచ్చే రోగులను ఫీవర్ ఆసుపత్రికి పంపిస్తున్నారు. ఆ పడకలూ రెండు మూడు రోజుల్లో నిండిపోతాయని అధికారులు చెబుతున్నారు. ఆయుర్వేద, నేచర్‌క్యూర్, సరోజినీదేవి కంటి ఆసుపత్రి తదితరాల్లో సాధారణ పడకలు మాత్రమే ఉండగా, వాటిలోనూ కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
రోగులు ఎందుకు పెరుగుతున్నారు?
రోజూ నగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో 2 వేలమందికి పైగా కరోనా బారిన పడుతున్నారు. చాలా మంది సొంత వైద్యంతో నెట్టుకొస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా మారిన తరువాతే పరీక్షకు వెళ్తున్నారు. ఫలితం వచ్చేటప్పటికి కొందరి ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం చూపుతోంది. ఇదే విధమైన నిర్లక్ష్యాన్ని కనీసం 20 శాతం మంది ప్రదర్శిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. దీనివల్లే ఈసారి ఆక్సిజన్, ఐసీయూ పడకలు అధికంగా అవసరమవుతున్నాయని కింగ్‌కోఠి వైద్యుడు తెలిపారు. వచ్చేవారం రోజుల్లో కరోనా బారిన పడిన రోగులకు ఎలా పడకలు సమకూర్చాలో అర్థం కావడం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరింత విజృంభిస్తున్న కరోనా.. చాలా ప్రాంతాల్లో ఆంక్షలు