సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు గుప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేకి లేఖ రాయడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. కోర్టును బెదిరించి వ్యక్తిగత లబ్ధి పొందాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి తన లేఖను మీడియా ద్వారా బహిర్గతం చేయడానికి ఒడిగట్టినట్లు కనిపిస్తోందని తీవ్రంగా ఆక్షేపించింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, సీనియర్ అడ్వొకేట్ మనన్‌కుమార్ మిశ్రా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
'సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోయే వరుసలో ఉన్న అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణను లక్ష్యంగా చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుసరించిన విధానాన్ని చూసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విస్మయానికి, భయాందోళనకు గురైంది. జడ్జిలపై లేనిపోని ఆరోపణలు చేసి వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు, పలువురు న్యాయమూర్తులపై ఆరోపణలు గుప్పించారు. న్యాయపరిపాలనా వ్యవస్థను అస్థిరపరచడానికి సమాజంలోని కొన్ని వర్గాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అంతర్గతంగా, బహిర్గతంగా దాడులకు ప్రయత్నించిన ఉదంతాలను దేశం ఇటీవల కాలంలో ఎన్నో చూసింది. ఇప్పుడు అది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే చేయడం భయాందోళన కలిగిస్తుంది. జస్టిస్ ఎన్‌వీరమణ కాబోయే ప్రధాన న్యాయమూర్తి వరుసలో ఉండటాన్ని బట్టి వీరు ఏ ఉద్దేశంతో లేఖ రాశారో స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాలను నేరవిముక్తం చేసే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కూడా జస్టిస్ రమణ చూస్తున్నారన్న విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా లెక్కలేనన్ని క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ లేఖను మీడియాలో బహిర్గతం చేయడం ద్వారా ఆయన గౌరవ న్యాయమూర్తిపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు, న్యాయవ్యవస్థకు బురద అంటించి దాని ప్రతిష్ఠను దిగజార్చడానికి ప్రయత్నించారు. ఇది న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీయడానికి వేసిన ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.
మర్యాదను కాపాడాల్సింది మనమే
న్యాయవ్యవస్థ క్రమశిక్షణ సూత్రాల దృష్ట్యా న్యాయమూర్తులు ఇలాంటి కుట్రపూరితమైన వ్యూహాలపై స్పందించలేరు. అందుకే ఆ వ్యవస్థ గౌరవమర్యాదలను నిలబెట్టాల్సిన బాధ్యత బార్‌తోపాటు, బాధ్యతాయుతమైన పౌరులపై ఉంటుంది. కోర్టుల విధులతోపాటు, దాని పరిపాలన వ్యవస్థను నాశనం చేసే రహస్య ఎజెండాతో కొన్ని శక్తులు చేస్తున్న దుష్టపన్నాగాలను తిప్పికొట్టాలి. ప్రధాన న్యాయమూర్తి విధినిర్వహణలో జోక్యం చేసుకొనే ఉద్దేశం మాకు ఏ మాత్రం లేదు. న్యాయవ్యవస్థపై బురదచల్లడానికి ప్రయత్నాలు జరిగిన ప్రతిసారీ లాయర్లు న్యాయస్థానాలకు అండగా నిలిచారు. వ్యవస్థను అపఖ్యాతి పాలుచేయడానికి జరిగిన ఏ కుటిల ప్రయత్నాలనూ ఈ దేశ న్యాయసముదాయం ఎన్నడూ సహించలేదు’’ అని మనన్‌కుమార్ మిశ్రా పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకోవాలనే: దిల్లీ బార్ అసోసియేషన్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీరమణపై ఆరోపణలు గుప్పిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేకి లేఖ రాయడాన్ని దిల్లీ బార్ అసోసియేషన్ ఖండించింది. న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకోవాలన్న దుర్బుద్ధితోనే ఈ పనిచేసినట్లు కనిపిస్తోందని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులతోపాటు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తూ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి, బహిరంగంగా విడుదల చేశారు. దీన్ని ఖండిస్తూ గురువారం దిల్లీ బార్ అసోసియేషన్ కార్యవర్గంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఎలాంటి ఆధారాలు లేకుండా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడానికి అనుమతించకూడదన్న సంప్రదాయం దీర్ఘకాలంగా ఉంది. అలా చేస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పని చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీరమణ నిజాయతీ, నిబద్ధత, నైతికత, విలువలకు పెట్టింది పేరు. ఆయనపై ఏపీ సీఎం ఆరోపణలను దిల్లీ బార్ అసోసియేషన్ నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది’ అని గురువారం విడుదల చేసిన ప్రకటనలో అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ నాసియర్, గౌరవ కార్యదర్శి దివ్యదర్శన్ శర్మ పేర్కొన్నారు.
తమిళనాడు అడ్వకేట్స్ అసోసియేషన్ ఖండన
జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం ఆరోపణలు గుప్పించడాన్ని తమిళనాడు అడ్వకేట్స్ అసోసియేషన్ తీవ్రస్థాయిలో ఖండించింది. ఈ మేరకు జగన్ రాసిన లేఖను తప్పుబడుతూ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ప్రభాకర్‌ను ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిన్యాయవ్యవస్థను రాజకీయం చేయడానికి చేసిన ప్రయత్నంగా అభివర్ణించింది.
సీఎం లేఖ బాధ్యతారాహిత్యం: సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీరమణకు వ్యతిరేకంగా సీఎం జగన్ లేఖ రాయడాన్ని సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం ఖండించింది. ఇలాంటి దుందుడుకు, బాధ్యతరాహిత్యమైన చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంటూ తీర్మానం చేసింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన మహిళా న్యాయవాదుల సంఘ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించినట్లు సంఘ ప్రధాన కార్యదర్శి ప్రేరణాకుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో రెండో అత్యంత సీనియర్ న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఏపీ సీఎం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి, మీడియా ద్వారా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: పీఎంఏవై ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకివ్వలేదు..?:హైకోర్టు