హైదరాబాద్ పరిధిలో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల అధీనంలో రెండు శవపరీక్ష(పోస్టుమార్టం) కేంద్రాలున్నాయి. ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందినా, రోడ్డు ప్రమాదాలు ఇతరత్రా ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినా మృతదేహాలను ఈ కేంద్రాలకు తీసుకువస్తారు. ఈ రెండు చోట్లకు నిత్యం 30 మృతదేహాలు పోస్టుమార్టం కోసం వస్తుంటాయి. నిబంధనల ప్రకారం.. పరీక్షలు చేసే సమయం చాలా తక్కువగా ఉండటంతో రెండు శవాగారాల వద్ద ఎప్పుడు చూసినా 20 మృతదేహాలు ఉండిపోతున్నాయి. ఇందులో హత్యలు, ఇతరత్రా కేసుల్లో పోలీసులు చొరవ చూపకపోవడంతో కొన్నింటికి పరీక్షలు వెంటనే జరగడం లేదు. పరీక్షలో జాప్యం (Autopsy Delay)తో ఇతర జిల్లాలకు చెందిన మృతుల బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందితే అదే రోజు శవపరీక్ష జరిపితే మరునాటికైనా తీసుకువెళ్లి అంత్యక్రియలు చేయడానికి అవకాశం ఉంటుంది. రాజధానిలోనే శవపరీక్షకు రెండు రోజులు ఆలస్యమైతే (Autopsy Delay) ఆదిలాబాద్‌లో మారుమూల ప్రాంతంలో సొంత గ్రామానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేయడానికి మరో రెండు రోజులు (Autopsy Delay) పడుతోంది. ఈ నేపథ్యంలో ఇక నుంచి సూర్యాస్తమయం తరువాత నుంచి ఉదయం వరకు కూడా శవపరీక్షలు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సత్వరమే ఇది అమలు కావాలని అనేక మంది కోరుకుంటున్నారు.
ఉస్మానియా సిద్ధమా!
ఉస్మానియాలో శవపరీక్ష చేయడానికి ఎనిమిది మంది ఫ్రొపెసర్లు, ఆరుగురు సహాయ ఫ్రొపెసర్లు, పీజీలు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ క్లాస్-4 సిబ్బంది కొరత అధికంగా ఉంది. ఈ శవాగారానికి ప్రతి రోజూ 12 నుంచి 15 మృతదేహాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఉన్న భవనంలో రూ.కోటి వెచ్చించి.. రాత్రివేళ శవపరీక్షల (Autopsy Delay)కు వీలుగా లైటింగ్ ఏర్పాటు చేయడం, సిబ్బందికి ఆహారం, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తే సరిపోతుందని చెబుతున్నారు.
గాంధీలో ఇలా..
గాంధీలో కూడా శవపరీక్ష కోసం పూర్తి వసతులు ఉన్న భవనం ఉంది. ఇక్కడ ఈ పరీక్షలు చేయడానికి వీలుగా దాదాపు 15 మంది వైద్యులు ఉన్నారు. సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో ఉన్నారు. ఇక్కడా నిత్యం 15 వరకు మృతదేహాలు వస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే రెండు ఆస్పత్రుల్లోని మార్చురీల్లో నిరంతరం పరీక్షలు చేయవచ్చని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: 'దిశ కేసు నిందితులకు మరోసారి శవపరీక్ష'