Telangana mlc election candidates 2021: తెలంగాణలోని ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో నామపత్రాలు దాఖలు చేసిన నలుగురిలో ముగ్గురు కోటీశ్వరులే.. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలు ప్రకటించారు. నామపత్రం దాఖలు చేసిన అభ్యర్థి తనతోపాటు భార్య, పిల్లల పేరుతో దేశవిదేశాల్లో ఉన్న ఆస్తులు, వాటి విలువ, పలు రకాల రుణాలు, క్రిమినల్ కేసుల వివరాలు స్వచ్ఛందంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో అభ్యర్థులు ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇలా..
తాతా మధుసూదన్, తెరాస అభ్యర్థి
Local body mlc elections telangana 2021: తెరాస అభ్యర్థి తాతా మధుసూదన్ తన పేరుతో బ్యాంకు డిపాజిట్లు (అమెరికా డాలర్లు, ఇండియా రూపాయలు), కార్లు వంటి చరాస్తులు రూ.1,74,17,181, తన భార్య భవానీ పేరుతో రూ.2,97,50,000 ఉన్నట్లు ప్రకటించారు. వ్యవసాయ భూములు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఖాళీ స్థలాలు వంటి స్థిరాస్తుల విలువ ప్రభుత్వ విలువ ప్రకారం తాతా మధుసూదన్ పేరుతో రూ.4,84,11,389 ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవే ఆస్తుల విలువ ప్రస్తుత బహిరంగ మార్కెట్‌లో రూ.15,59,05,625 ఉన్నట్లు పేర్కొన్నారు. వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమి విలువ రూ.1.50 కోట్లు కాగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.3,04,37,415 ఉన్నట్లు వెల్లడించారు. తన పేరుతో ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని ప్రకటించారు. ఇక కారు, ఖమ్మంలో ఒక అపార్ట్‌మెంట్, హైదరాబాద్ హకీంపేటలో కమర్షియల్ కాంప్లెక్స్‌లో 3100 చదరపు అడుగుల స్థలం, అమెరికాలోని డ్య్రూస్‌బే కౌంటీలో నివాసం, హైదరాబాద్ కొండాపూర్‌లో అపార్ట్‌మెంట్ ఉన్నట్లు వెల్లడించారు. భార్య భవానీకి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి
MLC Elections in khammam 2021: కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు తన పేరుతో బంగారం, నగదు, నాలుగు గ్రానైట్ కంపెనీల్లో షేర్లు రూపంలో రూ.2,35,96,408.36, భార్య పద్మ పేరుతో రూ.1,13,40,776.59 చరాస్తులున్నట్టు ప్రకటించారు. ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో వారసత్వంగా సంక్రమించిన 11.09 ఎకరాలు, సొంతంగా కొన్న 1.37 ఎకరాలుందని, ఈ భూమి విలువ రూ.50 లక్షలని పేర్కొన్నారు. భార్య పేరుతో 3.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని (విలువ రూ.10.50 లక్షలు) ప్రకటించారు. ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు, ఖాళీ స్థలాలు, నివాస భవనాలు, అపార్ట్‌మెంట్లు అన్నింటి విలువ రూ.2,11,43,000, భార్య పేరుతో ఉన్న స్థిరాస్తుల విలువ రూ.1,69,80,000గా లెక్కించారు. బ్యాంకుల్లో తన పేరుతో రూ.21,58,040 రుణాలు ఉన్నట్లు తెలిపారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని పేర్కొన్నారు. కర్నాటకలోని బెంగుళూరు యూనివర్సిటీలో 1988లో బీటెక్ పూర్తి చేసినట్లు తెలిపారు.
కొండపల్లి శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి
కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన కొండపల్లి శ్రీనివాసరావు తనకు 17.34 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, అందులో 11.34 ఎకరాలు వారసత్వంగా సంక్రమించిందని, 6 ఎకరాలు సొంతంగా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కొనుగోలు చేసిన ఆస్తుల విలువ రూ.1.23 కోట్లు, వారసత్వంగా సంక్రమించిన స్థిరాస్తుల విలువ రూ.90 లక్షలుగా పేర్కొన్నారు. తన పేరుతో ద్విచక్రవాహనం, కారు వంటి చరాస్తుల విలువ రూ.28 లక్షలుగా చూపారు. పేరువంచలో సొంత ఇల్లు, ఖమ్మం, కల్లూరు ప్రాంతాల్లో ఐదు ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు తెలిపారు. భార్య, ముగ్గురు పిల్లల పేరుతో ఎలాంటి ఆస్తులు లేవని ప్రకటించారు. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని తెలిపారు. బ్యాంకుల్లో రూ.73,04,537 రుణాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
కోండ్రు సుధారాణి, స్వతంత్ర అభ్యర్థి
భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో నివాసం ఉంటున్న కోండ్రు సుధారాణి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆదివాసీ మహిళ అయిన ఈమె సమర్పించిన అఫిడవిట్‌లో తన పేరు, భర్త వీరస్వామి పేరుతో ఎలాంటి ఆస్తులు లేవని పేర్కొన్నారు. సుధారాణి బ్యాంకు ఖాతాలో ప్రస్తుతం రూ.15,764.92, భర్త వీరస్వామి బ్యాంకు ఖాతాలో రూ.24వేలు ఉన్నట్లు ప్రకటించారు. 1992లో 7వ తరగతి పూర్తి చేసినట్లు ప్రకటించారు.