అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు పది పని రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 20 ప్రధానాంశాలపై సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 3 నుంచి 5 బిల్లులు ప్రవేశపెట్టే యోచనలో ఉంది. సోమవారం తొలిరోజున ‘దిశ’ హత్యోదంతంపై చర్చించనున్నారు. నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ... ప్రభుత్వం చేసిన చట్టంపై మరోసారి సభలో మాట్లాడనున్నారు. పాఠశాల విద్యలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం వంటి 20అంశాలపై చర్చించాలని ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాలపై సభలో గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్ష తెదేపా కూడా వ్యూహాలను సిద్ధం చేసుకుంది. శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశాన్ని రేపు ఉదయం సభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక నిర్వహించనున్నారు. తొలుత ఈరోజు సాయంత్రం 4:30కే సమావేశం ఏర్పాటు చేసినట్లు అసెంబ్లీ కార్యదర్శి మండలిలోని సభ్యులకు సమాచారం పంపారు. ఈ సమావేశాన్ని రేపటికి వాయిదా వేసినట్లు తాజాగా శనివారం సమాచారం పంపారు.
ఇదీచదవండి