రాష్ట్ర మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో నూతన పథకాలకు శ్రీకారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం 'జగనన్న విద్యా కానుక' పథకాన్ని తీసుకురానుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో మొదలయ్యే ఈ పథకం ద్వారా... ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, 3 జతల ఏకరూప దుస్తులు, 2 జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇవ్వాలని భావిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు విచారణ వేగవంతం చేసేలా కేబినెట్ చర్యలు చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే ఎర్రచందనం కేసుల విచారణకు తిరుపతిలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేలా మంత్రివర్గం ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి. 'మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' తరహాలోనే రాష్ట్రంలో 'ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్' ఏర్పాటుకు ముసాయిదా బిల్లును ప్రభుత్వం రుాపొందించింది. ఈ అంశానికి మంత్రివర్గం అమోదముద్ర వేయనుంది. ఈ ముసాయిదా బిల్లును బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇప్పటివరకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ 27 రోజుల వరకు ఉండగా... ఇకపై 20 రోజులకు కుదించనుంది. రాష్ట్రంలో కొత్తగా 'ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్' ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను... సౌర విద్యుత్ ప్లాంటు ద్వారా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిపాదనకు మంత్రివర్గ సమావేశంలో అమోదముద్ర పడనుంది. సీపీఎస్ రద్దు డిమాండ్‌తో గతంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ర్యాలీలపై నమోదైన కేసులను రద్దు చేయాలని మంత్రివర్గం భావిస్తోంది.
ఇదీ చదవండి :