ఈనెల 21 నుంచి పోలవరంపై ప్రత్యక్ష కార్యాచరణ: శైలజానాథ్ - శైలాజానాథ్ తాజా వార్తలు
ఈనెల 21 నుంచి పోలవరంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. సీఎం జగన్ పోలవరాన్ని ఆదాయ వనరులా మార్చుకున్నట్లు ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టుకు ఇందిరాగాంధీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఈ నెల 21 నుంచి కాంగ్రెస్ ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతుందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ చెప్పారు. పోలవరం పూర్తి చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ పోలవరాన్ని అక్షయపాత్రలా, ఆదాయ వనరులా మార్చుకున్నట్టు ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భాజపా నాయకత్వంలో వైకాపా పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు.
వైకాపా ప్రభుత్వం కనీసం రహదారుల్ని కూడా వేయలేకపోయిందని, ఉద్యోగులకు డీఏ కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు ఇందిరాగాంధీ పేరు పెట్టాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కోరారు.
తుపాన్లకు తీవ్రంగా దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు.