AP Medical Infrastructure Development Corporation: రాష్ట్రంలోని 1,145 ఆరోగ్య కేంద్రాలకు రూ.11.88 కోట్ల విలువైన హెడ్ లైట్, ఈఎన్‌టీ కిట్లు పంపిణీ చేయాలని జనవరి 19న హరియాణాలోని ఓ సంస్థకు అప్పగించారు. ఈ కిట్లు ప్రస్తుతం పీహెచ్‌సీలకు చేరుతున్నాయి. హెడ్ లైట్ (ఎల్‌ఈడీ), ఈఎన్‌టీ కిట్టు ధర ఎంతో తెలిపే ‘డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్’ ధ్రువపత్రాన్ని వీటితో పాటు జత చేసి సిబ్బందికి ఇస్తున్నారు. ఇందులో హెడ్‌లైట్ రూ.77వేలుగా, ఈఎన్‌టీ కిట్టును 15,645.53 రూపాయలుగా పేర్కొన్నారు. హెడ్‌లైట్ ధర బయట మార్కెట్లో రూ.3 వేల నుంచి రూ.20 వేల లోపే ఉందని ఈఎన్‌టీ వైద్యులు చెబుతున్నారు. నాణ్యత బట్టి ఈ ధరలు అటు ఇటుగా ఉంటున్నాయన్నారు. ప్రస్తుతం ఆస్పత్రులకు చేరిన హెడ్‌లైట్ సాధారణ స్థాయిలోనే ఉందని, ఎటువంటి ప్రత్యేకతలు లేవని పేర్కొంటున్నారు. ఈఎన్‌టీ కిట్టులో ప్రోబ్ (దూది పుల్ల మాదిరి) చెవి సిరంజీ, ట్యూనింగ్ ఫోర్క్, నాయిస్ మేకర్ (వినికిడి శబ్ధ పరీక్ష కోసం), ఈయర్ స్పెక్యులం (చెవి లోపల భాగం చూసేందుకు వినియోగిస్తారు) ఉన్నాయి. వీటిని ‘ఈనాడు’ ప్రతినిధి పరిశీలించినప్పుడు ఓ అట్టపెట్టెలో విడిగా హెడ్‌లైట్, అందులోనే ఉన్న మరో చిన్న బాక్సులో కిట్టులోని ఇతర వస్తువులు ఉన్నాయి. హరియాణాలోని కంపెనీ హెడ్‌లైట్, మరో కంపెనీ కిట్టులోని వస్తువులను తయారు చేసి పంపినట్లుగా వివరాల్లో పేర్కొన్నారు. ఇదే రకానికి చెందిన హెడ్‌లైట్, కిట్టును ప్రభుత్వానికి విక్రయించిన ధర కంటే తక్కువగానే ఇస్తామని కొన్ని సంస్థల ప్రతినిధులు చెప్పడం గమనార్హం.
ఓటో స్కోప్ ఉందా? లేదా?: చెవి లోపల భాగాన్ని సూక్ష్మంగా పరిశీలించేందుకు వినియోగించే ఓటో స్కోప్ కిట్టులో అంతర్భాగంగా ఉందా? లేదా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. 35 ఏళ్ల అనుభవం గల సీనియర్ ఈఎన్‌టీ వైద్యులు మాట్లాడుతూ ‘హెడ్‌లైట్, ఈఎన్‌టీ కిట్టును మేము రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్యన కొనుగోలు చేస్తున్నాం. స్వదేశీ ‘ఓటో స్కోప్’ రూ.10 వేలు, విదేశాలదైతే రూ.25వేల లోపు ఉంటుంది’ అని పేర్కొన్నారు.
‘జెమ్’ పోర్టల్ ధరలకనుగుణంగా కొనుగోలు: " రెండోసారి పిలిచిన టెండరు ద్వారా ఈ సంస్థను ఎంపిక చేశాం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పరికరాల ఎంపిక జరిగింది. బీఎఫ్‌సీ సమావేశంలో చర్చించాం. జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి వచ్చిన ఇండెంట్ల ప్రకారం రెండోసారి టెండరు పిలిచినప్పుడు పాల్గొన్న మూడు సంస్థలు హెడ్‌లైట్‌కు రూ.86 వేలు-రూ.95 వేల మధ్య ధర కోట్ చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘జెమ్’ పోర్టల్‌లో దీని ధర రూ.89 వేలుగా ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుని సాంకేతిక సిఫార్సులతో టెండరు ఖరారు చేశాం. మేమిచ్చిన ఆర్డరులో హెడ్‌లైట్, కిట్టుతో పాటు ‘ఓటో స్కోప్’ ఉంది. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నాం. అనుమానాలకు తావు లేదు. ఒప్పందానికి భిన్నంగా వేరే మోడల్స్ ఆస్పత్రులకు వెళ్తున్నాయా అన్నది పరిశీలిస్తాం." -మురళీధర్‌రెడ్డి, ఎండీ, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ