తొలి విడతలో 52.13 లక్షల మందికి రూ.2వేల చొప్పున నగదు జమ చేయగా.. అయిదో విడతలో 39.12 లక్షల మందే లబ్ధిపొందారు. ఆరో విడతలో 38.46లక్షల మందిని అర్హులుగా గుర్తించగా.. మంగళవారం నాటికి 31.32 ఖాతాల్లో నగదు వేశారు.
ఈ పథకం కింద కేంద్రం ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతు ఖాతాల్లో వేస్తోంది. 2018-19 తొలి విడత, 2019-20లో మూడు సార్లు, 2020-21లో రెండు విడతల చొప్పున.. ఇప్పటిదాకా మొత్తం రూ.12వేలు రైతులకు అందింది.అయిదో విడతలో 46.86లక్షల మందికి నగదు విడుదల కాగా... 39లక్షల మంది ఖాతాల్లోకి జమైంది. ఆరో విడతకు వచ్చేసరికి 38.46లక్షల మంది ఖాతాలకే నగదు విడుదలైంది. అంటే మూడు నెలల్లోనే లబ్ధిదారుల సంఖ్య ఏకంగా 8.40లక్షలు తగ్గింది. ఆదాయపు పన్ను చెల్లించేవారు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లోని వారు, ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు రూ.10 వేలకు పైగా పింఛను పొందేవారు, వృత్తి నిపుణులకు ఈ పథకం వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది. అనర్హులను తొలగించడంతోపాటు.. రైతు కుటుంబం ప్రాతిపదికగా తీసుకోవడంతోనూ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రానికి రూ. 9 లక్షల కోట్ల నిధులివ్వండి'