పరిషత్ ఎన్నికల ప్రక్రియపై మరోసారి హైకోర్టులో వాదనలు జరిగాయి. ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపేందుకు అవకాశం ఇవ్వాలని.. ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సడలించాలని ఎస్‌ఈసీ అభ్యర్థించింది. గతంలో ఫాం-10 పొందని వారు.. గత శుక్రవారం నుంచి మంగళవారం వరకూ ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఫారం-10 తీసుకున్నారని హైకోర్టు దృష్టికి ఎస్‌ఈసీ తీసుకొచ్చింది. గతేడాది పరిషత్ ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలపై ఇప్పటికీ ఎస్ఈసీకి ఫిర్యాదులు వస్తున్నాయని.. పలు రాజకీయ పార్టీలు సైతం విజ్ఞప్తి చేశాయని తెలిపింది. నిష్పాక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకే.. ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు . ఈ విచారణ వల్ల ఎవరికి నష్టం జరగదన్నారు. ఏకగ్రీవం అయిన వారిపై తొందరపాటు చర్యలు తీసుకోవడం లేదన్నారు. నామినేషన్ల సందర్భంగా తీవ్రమైన ఉల్లంఘలను ఏమైనా జరిగాయా? లేదా ? అనే విషయాన్ని సరిపోల్చి చూడటం కోసం విచారణకు ఆదేశించామన్నారు. ఫాం-10 పొందిన వారి ప్రయోజనాల్ని రక్షిస్తూనే విచారణ ప్రక్రియను కొనసాగనివ్వాలని ఎస్‌ఈసీ హైకోర్టును కోరింది.
హైకోర్టులో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయంటూ పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోవడం సరికాదని.. ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. కరోనా రెండోదశ ప్రమాదం పొంచి ఉన్న కారణంగా ఎన్నికలు త్వరగా జరపాలన్నారు. ఫాం-10 ఇచ్చిన చోట ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లేనన్నారు. అక్రమాలు చోటు చేసుకుంటే ఎన్నికల ట్రైబ్యునల్లో సవాలు చేసుకోవాలన్నారు. తాజాగా ఫాం-10 పొందారని ఎస్‌ఈసీ ఏ ఆధారంతో చెబుతోందని.. పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఈ విషయం ఎస్ఈసీకి ఎలా తెలిసిందో తెలపాలన్నారు. ఏకగ్రీవం అయినట్లు ధ్రువపత్రాలు పొందాక.. విచారణ జరిపి ప్రయోజనం ఉండదన్నారు. దీనిపై విచారణ జరిపే అధికారం ఎస్ఈసీకి లేదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎస్‌ఈసీని ఆదేశించాలన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఎస్‌ఈసీని ఆదేశిస్తూ.. విచారణను మార్చి 1కి వాయిదా వేశారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటి వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలో వెయ్యి చెరువులు మాయం!