రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కేసుల్లో లోతైన కుట్ర దాగుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ స్పష్టం చేశారు. మతసామరస్యం నెలకొల్పేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను నియమించినట్టు వెల్లడించారు. మరోవైపు కృష్ణా , రాజమహేంద్రవరంలో జరిగిన విగ్రహాల ధ్వంసం కేసులో ఒకే ఎలక్ట్రిక్ రంపం వాడినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న విగ్రహాల ధ్వంసం కేసులు పాలనా యంత్రాంగానికి సవాలుగా మారాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ అన్నారు. ఈ ఘటనల్లో లోతైన కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ నేరాలను అంత తేలిగ్గా తీసుకోలేమన్నారు. ఇటీవల విగ్రహాలపై జరిగిన దాడులు అప్రతిష్ట తెచ్చాయన్నారు. మత సామరస్యం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్రస్థాయి కమిటీలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైన్లు ఇతర మతాల వారు సభ్యులుగా ఉంటారని చెప్పారు. జిల్లా స్థాయిలోనూ ఈ తరహా కమిటీలు కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటవుతాయన్నారు. విధ్వంసాలకు పాల్పడిన కుట్రదారులను ప్రభుత్వం చట్టం ముందు నిలబెడుతుందని చెప్పారు.
రాష్ట్రంలో దేవాలయాల్లో ఇటీవల జరిగిన వరుస ఘటనలతో చెడ్డపేరు వచ్చింది. ఈ తరుణంలో ప్రభుత్వం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మతసామరస్యానికి కట్టుబడి ఉందని స్పష్టమైంది. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నిస్తే..చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
ఆదిత్యనాధ్ దాస్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
కృష్ణా ,రాజమహేంద్రవరంలో జరిగిన విగ్రహాల ధ్వంసం ఘటనల్లో ఒకే ఎలక్ట్రిక్ రంపం వినియోగించినట్టు ఆధారాలు ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అంతర్వేది ఘటన తర్వాత జరిగిన వాటిని ఒక్కో దానితో సరిపోల్చుతున్నామని ...ఆధారాలన్నీ ఒకే చోటకు చేర్చి CID దర్యాప్తునకు ఇచ్చామని చెప్పారు. ఒత్తిడితో ఎవరో ఒకరిపై కేసులు నమోదు చేయడం లేదన్నారు.
రవిశంకర్ అయ్యన్నార్
శాంతిభద్రతల అదనపు డీజీ
రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కేసులు 2019లో 6 నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. 2020లో 29 ఘటనలు జరిగితే 2021లో 3 ఘటనలు చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ కేసుల్లో ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్టు స్పష్టం చేసింది.