రాష్ట్ర ప్రభుత్వాలు ద్రవ్యలోటు పూడ్చుకునేలా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచేందుకు కేంద్రం అంగీకరించటంతో రాష్ట్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం విషయంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటు వినియోగించుకునేలా కసరత్తు ప్రారంభించింది. ఎఫ్‌ఆర్‌బీఎం ఐదు శాతం మేర ఉంటే.... 20 వేల కోట్ల మేర రుణం సమీకరించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. 5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం వినియోగించుకునేందుకు అమలు చేయాల్సిన కేంద్ర నిబంధనలపై.... అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.
ఆమోదముద్ర పడగానే....!
పరిమితి పెంపునకు 'వన్ నేషన్-వన్ రేషన్'తో సహా ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల విషయంలో కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను అమలు చేయాల్సి ఉంది. ఈ విషయంలోనూ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మరోవైపు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచుకునేందుకు అవసరమైన ఆర్డినెన్సును..... ఇప్పటికే ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. దీనిపై ఆయన ఆమోదముద్ర పడగానే రుణ సమీకరణతో పాటు ఆదాయ వనరులు పెంచే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
యూజర్ ఛార్జీల పెంపు..?
ఆదాయ వనరులను పెంచుకుంటే మరిన్ని నిధులు, రుణాలు సమీకరించుకోవచ్చని రాష్ట్ర ఆర్థికశాఖ భావిస్తోంది. విద్యుత్ రంగ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విషయాన్ని పరిగణిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల 72 వేల పంపుసెట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నిటికీ మీటర్లు బిగించటం ద్వారా విద్యుత్ వినియోగాన్ని గణించనున్నారు. దీంతోపాటు మున్సిపాలిటీల్లోనూ యూజర్ ఛార్జీలు పెంచే అంశాన్నీ ప్రభుత్వం పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయం పెంచుకునే మార్గంలో భాగంగా రవాణాశాఖలోని యూజర్ ఛార్జీలు కూడా సవరించే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి