కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో పదోతరగతి, ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మేనెల చివరిలో నిర్వహించే అవకాశం ఉంది. లాక్‌డౌన్ సడలించిన తర్వాత పదో తరగతి పరీక్షల నిర్వహణకు రెండు వారాల సమయం పట్టనుంది. పరీక్ష కేంద్రాల ఏర్పాట్లు, ప్రశ్నపత్రాల తరలింపునకు ఈ సమయం అవసరం. దీంతో మే నెల చివరి వారంలోనే పదోతరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
* ఎంసెట్‌తో పాటు ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల సమయాన్ని పొడిగించనున్నారు. ఎడ్‌సెట్ మినహా మిగతా వాటికి గతంలో ఇచ్చిన గడువు ఈనెల 17తో ముగియనుంది. దీన్ని మే నెల మొదటి వారం వరకు పెంచే అవకాశం ఉంది. ఎంసెట్ పరీక్ష కేంద్రాల సామర్థ్యం, ఏర్పాట్లకు లాక్‌డౌన్ తర్వాత రెండు వారాల సమయం పడుతుందని ఇప్పటికే టీసీఎస్ సంస్థ ఉన్నత విద్యామండలికి తెలిపింది. హాల్‌టిక్కెట్ల జారీకి మరో వారం కావాలి. దీంతో లాక్‌డౌన్ తర్వాత మూడు వారాల అనంతరమే ఎంసెట్ నిర్వహించే పరిస్థితి నెలకొంది. కేంద్రం సడలింపులు ఇస్తే ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు.
ఆన్‌లైన్ పాఠాలు
ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాల్లో 20-30 శాతం పాఠ్యాంశాలు పూర్తి చేయాల్సి ఉండగా.. వీటిని ఆన్‌లైన్‌లో బోధించనున్నారు. మరికొన్నింటిలో దాదాపుగా అకడమిక్ సిలబస్‌పూర్తయింది. పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈనెల 20 తర్వాత లాక్‌డౌన్‌లో సడలింపులు ఇస్తే కొవిడ్-19 కేసులు లేని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వర్సిటీల పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
* రాష్ట్రంలో 14 విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో మంత్రి సురేష్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, వచ్చే విద్యా సంవత్సరం సన్నద్ధతపై ఈనెల 21న మరోమారు సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించింది ఇందుకే...