గుజరాత్ నుంచి బస్సులు వస్తోన్న మత్స్యకారులు విజయవాడకు చేరుకున్నారు. 12 బస్సుల్లో 887 మందిని ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొచ్చింది. కృష్ణా జిల్లా ఎనికేపాడులో మంత్రి మోపిదేవి వెంకటరమణ మత్స్యకారులకు ఆహారం, మంచినీరు అందజేశారు. ఎనికేపాడు నుంచి నేరుగా మత్స్యకారుల స్వస్థలాలకు బస్సులు వెళ్లనున్నాయి. జిల్లాలకు చేరుకున్న వారిని స్థానికంగా ఏర్పాటుచేసిన క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
లాక్‌డౌన్ కారణంగా తిండి లేక నరకయాతన అనుభవించామని మత్స్యకారులు వాపోయారు. కొంతమంది చనిపోవడం బాధ కలిగించిందన్నారు. స్వగ్రామాలకు చేరుకుంటామో లేదోనని ఆందోళన చెందామన్నారు. సీఎం, అధికారులు చేసిన సాయం వల్లే సొంత ప్రాంతాలకు వెళ్తున్నామని మత్స్యకారులు చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు.
ఉదయం గరికపాడు వద్దకు చేరుకున్న మత్స్యకారులు
గుజరాత్ నుంచి మొన్న బయలుదేరిన మత్స్యకారులు రాష్ట్ర సరిహద్దులకు ఈ ఉదయం చేరుకున్నారు. కృష్ణా జిల్లా గరికపాడు-జగ్గయ్యపేట చెక్‌పోస్టు వద్దకు చేరుకున్న మత్స్యకారులకు ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను, జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు, అధికారులు స్వాగతం పలికారు. బస్సుల్లో వస్తున్న మత్స్య కారులకు జాగ్రత్తలు చెప్పి విడతల వారీగా స్వస్థలాలకు పంపారు. మత్స్యకారులకు అల్పాహారం, మంచినీటి వసతి కల్పించారు. అనంతరం జాలర్లు విజయవాడకు బయలుదేరారు. లాక్‌డౌన్‌తో గుజరాత్‌లో చిక్కుకున్న 3800 జాలర్లను ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకోస్తుంది.
ఇదీ చదవండి : గుజరాత్ నుంచి స్వస్థలాలకు రాష్ట్ర జాలర్లు..!