Cabinet meeting: సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో.. పలు అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నిరోధానికి చట్ట సవరణ ప్రతిపాదనపై చర్చ జరపనున్నట్లు అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు మంత్రి మండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాల జెడ్పీ ఛైర్మన్ల పదవీకాలం పూర్తయ్యే వరకు కొత్త జిల్లాలకు కొనసాగించేలా చట్ట సవరణపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.
ఈ నెల 27 తేదీన 'అమ్మఒడి' పథకం నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. బైజుస్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ ప్రతిపాదనపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 35 సంస్థలకు 112 ఎకరాల భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ చేపట్టనున్న 3700 మెగావాట్ల పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు ప్రతిపాదనపై చర్చ జరగనున్నట్టు సమాచారం.
పులివెందులలో పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.50 కోట్లతో పెట్టనున్న గార్మెంట్స్ తయారీ పరిశ్రమకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కృష్ణాజిల్లా మల్లవెల్లి ఫుడ్‌పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు అనుమతి తెలపనుంది. కొప్పర్తిని టెక్స్‌టైల్ రీజియన్ అపారెల్ పార్క్‌గా తీర్చిదిద్దే ప్రతిపాదనపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: