కరోనా బారినపడిన వైద్య సిబ్బంది చికిత్సకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యుడు ఎన్.భాస్కరరావుకు ఖర్చయిన సుమారు రూ.కోటిన్నరను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందించేందుకు సీఎం జగన్ ఆమోదించారని వివరించారు.
వైద్య సిబ్బందికి సంబంధించి ఇలాంటి కేసులు ఇంకా ఏవైనా తమ దృష్టికి వస్తే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. ఈ విషయంలో సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. శనివారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘45 ఏళ్లు పైబడిన వారందరికీ నెలరోజుల్లో టీకాలను వేస్తాం. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45 ఏళ్లు దాటిన వారికి కలిపి 53.08% మందికి తొలి టీకా వేశాం’ అని వెల్లడించారు.
యువతపై మూడో దశ ప్రభావం
‘కరోనా మూడో దశ అంటూ వస్తే యువతపై ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశముంది. వైరస్ మ్యుటేషన్ ఎలా ఉన్నా మూడో దశలో యువకులు, పిల్లలు ఎక్కువ ప్రభావితం కావచ్చన్న ఉద్దేశంతో పడకలు, వెంటిలేటర్ల పెంపు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే కేసుల తగ్గుదలకు తగ్గట్టు మరణాల సంఖ్య తగ్గాలని లేదు. ఇది బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడుతుంది. మేము ఎలాంటి వివరాలనూ దాచడం లేదు’ అని అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు.
సెప్టెంబరు నుంచి ఉపకార వేతనం పెంపు అమలు
సీనియర్ రెసిడెంట్ వైద్యులకు నెలకు ఇచ్చే ఉపకార వేతనాన్ని రూ.45వేల నుంచి రూ.70వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ ఏడాది జనవరినుంచి అమలు చేయాలని భావించగా, సీఎం జగన్ గతేడాది సెప్టెంబరునుంచే వర్తింపజేయాలని ఆదేశించారని సింఘాల్ వివరించారు. పీజీ మూడో సంవత్సరం విద్యార్థులు ఏప్రిల్ 30 తర్వాత కొవిడ్ విధుల్లో చేరారని, వీరికి కూడా ఉపకార వేతనం పెంపు నిర్ణయాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఇకపై పీజీ వైద్య విద్యార్థులకు ఉపకార వేతనాల పెంపు ఎప్పుడు జరిగితే అప్పుడు సీనియర్ రెసిడెంట్ వైద్యులకు కూడా ఉపకార వేతనాన్ని పెంచుతామని తెలిపారు.
వైద్యసంఘాల కృతజ్ఞతలు: ప్రభుత్వ వైద్యుడికి చికిత్స విషయంలో సీఎం స్పందించిన తీరును వైద్య సంఘాల నేతలు శ్యాంసుందర్, జయధీర్ ఆహ్వానించారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:
Kakani counter: సోమిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే కాకాణి