వీడియో పాఠాలు, ఈ-పాఠ్యపుస్తకాలు, కోర్సులు.. అన్నీ ఉన్న 'దీక్ష' యాప్ విద్యార్థులకు ఎంతగానో లాభిస్తోంది. పాఠ్యాంశాల వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవడం, విద్యార్థులే కాక ఎవరైనా సరే తమకు నచ్చిన కోర్సు చదువుకునే సదుపాయాలు ఇందులో ఉన్నాయి. పాఠ్యపుస్తకాల్లోని 'క్యూఆర్ కోడ్'ను స్కాన్ చేయడం ద్వారా వీడియో పాఠాలు, ఈ-పాఠ్యపుస్తకాలు డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. ఓ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని బోధన విధానమే కాక పక్క రాష్ట్రాల కంటెంట్‌నూ తెలుసుకునే అవకాశముంది. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఈ యాప్‌ను 14 మిలియన్ల మంది వినియోగించగా.. దేశంలోనే ప్రథమస్థానంలో మన రాష్ట్రమే ఉంది.
పాఠ్యపుస్తకానికి అనుబంధంగా పాఠాలు, వీడియోలు ఉన్న ప్లాట్‌ఫామ్ దీక్ష ఒక్కటే. రాష్ట్రంలోని పాఠ్యపుస్తకాల్లో రెండు రకాల క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారు. ఒకటి స్కాన్ చేస్తే పాఠ్యాంశ వీడియో వస్తుంది. మరొకటి స్కాన్ చేస్తే నేర్చుకున్న అంశాలపై విద్యార్థిని పరీక్షించే ప్రశ్నలు వస్తాయి. క్విజ్ రూపంలో ఉండే ప్రశ్నలకు సమాధానమివ్వడం ద్వారా విద్యార్థులు తమ సామర్థ్యాన్ని పరీక్షించుకోవచ్చు. ఒక సబ్జెక్టులోని పాఠ్యాంశం గురించి పూర్తిస్థాయిలో అభ్యసించే సదుపాయం ఈ యాప్‌లో ఉంది. ఒకేసారి పైస్థాయి వరకు సబ్జెక్టు తెలుసుకోవచ్చు.
కొవిడ్ తొలి దశలో దూరదర్శన్ ద్వారా నిర్వహించిన విద్యావారధి టీవీ పాఠాలూ దీక్షలో లభిస్తాయి. పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియోలను ఉపాధ్యాయులు స్వయంగా రూపొందించి అప్‌లోడ్ చేసే వీలూ ఉంది. ఇందుకు పాఠశాల విద్యాశాఖ దీక్ష విభాగం అనుమతి తీసుకోవాలి. వీడియోలను దీక్ష విభాగం సమీక్షించేందుకు... రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో సబ్జెక్టుకు 400 మంది నిపుణులను నియమించారు. విద్య సంబంధిత కోర్సులే కాక... పాఠాన్ని ఎలా బోధించాలి..? బహుళ తరగతి బోధన ఎలా..? వంటి అనేక వీడియోలు ఈ యాప్‌లో ఉన్నాయి. విద్యార్థులకు పునఃశ్చరణ తరగతులూ నిర్వహించే సదుపాయముంది.
ఇదీ చదవండి:
RRR Letter to CM: పోలీసు కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్ నియామకంపై రఘురామ లేఖ