హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో అమెనిటీస్ సెంటర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా... 100 శాతం అక్షరాస్యత సాధించలేక పోయామన్నారు. విద్య అనేది సామాజిక అసమానతలు తగ్గించి... సంపూర్ణ పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా... సవాళ్లను అధిగమించేందుకు తోడ్పడుతుందని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. కేంద్రం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన విద్యా విధానం 21వ శతాబ్ధం సవాళ్లు అధిగమించేలా ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ ఉపకులపతి అప్పారావు, డీన్ నాగార్జున పాల్గొన్నారు. ప్రపంచంలోకెల్లా.. భారత ఉన్నత విద్యా సంస్థలు ఉత్తమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నాయని కొనియాడారు.
ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంతో ఉన్నత విద్యలో... భారత్ ఒక హబ్‌గా మారిందని వెంకయ్యనాయుడు తెలిపారు. ఇప్పటికే ఐఐటీ ముంబయి, దిల్లీ వంటి సంస్థలు ప్రపంచంలో టాప్ 10లో చోటు సంపాదించాయని వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కూడా గొప్ప పేరుందని... ఆ పేరు మరింత ఇనుమడింపజేసేలా సానుకూల దృక్పథంతో అడ్మినిస్ట్రేషన్, ఫాకల్టీ విభాగాలు, విద్యార్థులు కృషి చేయాలన్నారు. ప్రపంచంలో భారతదేశం మానవ వనరుల భాండాగారంగా అవతరిస్తున్న దృష్ట్యా... భవిష్యత్తులో సృజనాత్మకత జోడించి సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడం సహా... యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఉపరాష్ట్రపతి సూచించారు.