అమరావతి రైతుల పోరాటం కొనసాగుతోంది. 44వ రోజూ రాజధాని గ్రామాల్లో జై అమరావతి నినాదాలు మార్మోగాయి. భూములు త్యాగం చేసిన తమకు పాలనా వికేంద్రీకరణ పేరుతో అన్యాయం చేయొద్దని మహిళలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సరిహద్దు గ్రామాలకు చెందిన తెలంగాణ రైతులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు.
రాజధాని గ్రామాల్లో దీక్ష చేస్తున్న రైతులకు ప్రకాశం జిల్లా ఐకాస నాయకులు మద్దతు తెలిపారు. మహిళలను కన్నీరు పెట్టిస్తున్న జగన్ రాజకీయ పతనం దగ్గర్లోనే ఉందని వారు హెచ్చరించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద గాంధీజీ 72వ వర్ధంతిని పురస్కరించుకొని మహాత్ముడి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 21 రోజులుగా అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం ముగింపు కార్యక్రమంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు, వామపక్ష నేతలు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 3 రాజధానులకు వ్యతిరేకంగా తెదేపా నాయకులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ సీడ్స్ కూడలి నుంచి ర్యాలీ చేపట్టగా... పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.