అమరావతి అన్నదాతల నిరసనలు 300వ రోజున రాజధాని గ్రామాల్లో హోరెత్తాయి. మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తును ఉద్యమించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి ప్రాంతాలు నినాదాలతో మార్మోగాయి. ఆకుపచ్చ చీరలు ధరించి మహిళలు నిరసనలో పాల్గొన్నారు. వెలగపూడి దీక్షాశిబిరం వద్ద తెలుగుతల్లి, అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు.
300 రోజులుగా ఉద్యమిస్తున్న అమరావతి రైతులకు....రాష్ట్రవ్యాప్త మద్దతు లభించింది. విజయవాడలోని గాంధీనగర్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట... మహిళా ఐకాస నేతలు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద... అఖిలపక్షం నిరసన కార్యక్రమం చేపట్టింది. వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులకు 3 రాజధానుల నిర్ణయంతో అన్యాయం జరిగిందని జనసేన నేత రామ్మోహన్ రావు అన్నారు. ధర్మపోరాటంలో అంతిమవిజయం అమరావతి రైతులదేనని.... గుడివాడ తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో రైతులు 12 గంటల నిరాహార దీక్ష చేశారు.
అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా... రాజమహేంద్రవరంలో తెలుగుదేశం నాయకులు నిరసన చేపట్టారు. రైతులు 300 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని విమర్శించారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని... కాకినాడలో అమరావతి పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. రాష్ట్రం అభివృద్ధిపథంలో సాగాలంటే పాలనా రాజధాని అమరావతిలోనే ఉండాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రభుత్వ చట్ట వ్యతిరేక చర్యలను అడ్డుకుంటున్న న్యాయస్థానాలపై వ్యాఖ్యలు సరికాదని.... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలో అన్నారు.
అమరావతి రైతులకు అన్యాయం చేయొద్దంటూ.. కర్నూలులో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కడప జిల్లా రాజంపేటలో.... తెలుగుదేశం నేతలు అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: అమరావతి గడ్డపైన గడ్డి కూడా తొలగించలేరు: లోకేశ్