రాష్ట్రంలోని సూర్యలంక, భోగాపురం, దొనకొండ తదితర ప్రాంతాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేసే శిక్షణా కేంద్రాలకు తగిన భూములను కేటాయించాలని ఎయిర్ వైస్ మార్షల్ ప్రశాంత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి విజ్ణప్తి చేశారు. ఈ మేరకు సూర్యలంక ఇండియన్ ఎయిర్ ఫోర్స్స్టేషన్ సదరన్ ఎయిర్ కమాండ్, గ్రూప్ కెప్టెన్ ఎయిర్ వైస్ మార్షల్ ప్రశాంత్ నేతృత్వంలో ఎయిర్‌ఫోర్స్ అధికారులు సచివాలయంలో సీఎస్‌ను కలిశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సూర్యలంక తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న శిక్షణా కేంద్రాలకు తగిన భూములు కేటాయించే అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎస్ స్పష్టం చేశారు. సూర్యలంక, దొనకొండలతో పాటు విజయవాడ, భోగాపురం విమానాశ్రయాలను ఆనుకుని ఏర్పాటు చేసే ఎయిర్ ఫోర్స్ కేంద్రాలకు తగిన భూములను నిర్దిష్ట ధరల ప్రకారం కేటాయించాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.
మరోవైపు విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ స్టాప్ వైస్ అడ్మిరల్ ఎస్.ఎన్.ఘోర్మడేతో కూడిన అధికారుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యింది. తూర్పు నౌకాదళానికి వివిధ ప్రాంతాల్లో భూములు కేటాయించేందుకు తగిన స్థలాలను గుర్తించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌ను, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే కోస్టల్ సెక్యూరిటీ, మెరైన్ పొల్యూషన్, ఏపీ మారిటైమ్ బోర్డు తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. మార్చి నెలలో విశాఖపట్నంలో నిర్వహించనున్న మిలాన్ - 2020 ఈవెంట్‌కు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని నౌకాదళ అధికారులు ఆహ్వానించారు.