ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమంటూ రాష్ట్రప్రభుత‌్వం హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిందని... జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ ప్రక్రియ ఉండొచ్చని కోర్టుకు తెలిపింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పోలిన విధంగానే వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల్లో ఉందని పేర్కొంది. ఎన్నికల ప్రకియ తరహాలో సిబ్బందిని కూడా ఉపయోగించాల్సి ఉందని వెల్లడించింది. దేశంలో కొవిడ్ రెండో వేవ్ మొదలైందని... మొదటి దశలో తీవ్రంగా ఉన్న తరహాలోనే డిసెంబర్ నుంచి మార్చి వరకు ఉండే అవకాశముందని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే సిబ్బంది కరోనా బారినపడే అవకాశం ఉందని... ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకుని మొదటి దశ వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు వేచి చూసేలా ఎస్ఈసీని ఆదేశించాలని అఫిడవిట్‌లో పేర్కొంది.
ఫిబ్రవరిలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబరులో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి... ప్రొసీడింగ్స్ నిలుపుదలకు నిరాకరించారు. మంగళవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ.... ఓ ప్రణాళికాబద్ధంగా జరిగే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో లక్షల మంది ఆరోగ్య సిబ్బంది, పొలీసులు పాల్గొంటారని కోర్టుకు వివరించారు. వ్యాక్సిన్ సరఫరా చేయడంలో పోలీసుల పాత్ర కీలకమన్నారు.
ప్రభుత్వం వేసిన అదనపు అఫిడవిట్‌పై కౌంటర్ వేస్తామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్విన్‌కుమార్ కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
ఇదీ చదవండి: