తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగియడంతో బాలాలయంలో నిత్యోత్సవాలకు పూజారులు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. దీంతో శనివారం ఉదయం నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నిత్యకల్యాణం, పచ్చతోరణంగా విలసిల్లుతున్న పంచనారసింహ క్షేత్రంలో భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. వేకువజామున సుప్రభాతం చేపట్టి నిత్య కైంకర్యాలను కొనసాగించారు.
భక్తులకు దర్శనమిచ్చే కవచమూర్తులను బంగారు పుష్పాలతో ఆరాధించారు. వేదోచ్చారణలతో హోమం జరిపారు. విష్వక్సేన పూజతో కల్యాణోత్సవం చేపట్టారు. ఆర్జితసేవలో పాల్గొన్న భక్త దంపతులకు ఆశీస్సులతోపాటుగా.. తలంబ్రాలను అందజేశారు. ఆలయ మండపంలో అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. లక్ష్మీదేవిని ప్రత్యేక అలంకరణలో తీర్చిదిద్ది ఊయలపై అధిష్ఠింపజేసి మంగళ వాయిద్యాల నడుమ సేవోత్సవం కొనసాగింది.
ఇదీ చదవండి: సీఎం ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా