అమరావతిలో వైవిధ్యభరితమైన భూములు ఉన్నాయని.. అనేక రకాల పంటలు పండే నేల అమరావతి సొంతమని.. తెలంగాణ జనసమితి ఛైర్మన్ ఆచార్య కోదండరాం అన్నారు. హైదరాబాద్లో జరిగిన అమరావతి అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజధాని వస్తే తమ జీవితాలు మారతాయని భావించిన అమరావతి రైతులు.. నేడు చేదు ఘటనలతో బతకాల్సి రావడం కలిచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధానిగా అమరావతి నిర్ణయం ఎలాంటి గొడవలు లేకుండా జరిగిందని.. అలాంటిది నేడు రాజధాని కోసం రైతులు పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అమరావతిలో ఇప్పటికే కొన్ని భవనాలు నిర్మించారని.. అభివృద్ధిలో భాగంగా చెరువులు, వాగులు మూసేశారని.. భూమి సరిహద్దులు చెరిగిపోయాయన్నారు. అందుకే రైతులు వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారన్నారు. ఉద్యమం చేస్తున్న రైతులతో ప్రభుత్వం చర్చలు జరపాల్సిందిపోయి.. దూషణలకు దిగడం, లాఠీఛార్జీలకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతలను విస్మరించడం వల్లే రాజధాని సమస్య ఇంత క్లిష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. 29 గ్రామాల ప్రజల సమస్య పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.
అండగా ఉంటాం
అమరావతిలోని రైతుల్లో, ప్రజల్లో మనోధైర్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని.. జాతీయ మానవ హక్కుల వేదిక కన్వీనర్ జీవన్ కుమార్ అన్నారు. అమరావతి రైతులకు, ప్రజలకు మానవ హక్కుల వేదిక సంఘీభావం అందిస్తుందని.. అలాగే తమ వంతు సహకారం అందిస్తామని కోదండరాం స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: