shooting incident: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. మేరీల్యాండ్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నల్గొండ యువకుడిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నల్గొండ వాసి నక్క సాయి చరణ్(26) మృతి చెందాడు. మార్నిగ్ వాక్ కోసం కారు దిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అతనిపై ఆదివారం కాల్పులు జరపగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సాయిచరణ్ ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడని మృతుడి తండ్రి నరసింహ తెలిపారు. సిన్సినాటి వర్శిటీలో ఎంఎస్ పూర్తిచేశాడని.. ఆరునెలలుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని చెప్పారు. కొద్ది రోజుల క్రితమే సాయిచరణ్ కారు కొన్నాడని మార్నింగ్ వాక్ కోసం వెళ్తుండగా ఈఘటన జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి మరణవార్త సోమవారం రాత్రి తెలిసిందని పేర్కొన్నారు. నవంబర్‌లో ఇంటికి వస్తానని ఈనెల 17న చివరిసారిగా మాట్లాడానని చెబుతూ బోరున విలపించారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వస్థలానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని నరసింహ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మృతుడి కుటుంబాన్ని పలువురు రాజకీయ నేతలు పరామర్శించారు.
ఇదీ చదవండి:
"నా భార్య 9 పెళ్లిళ్లు చేసుకుంది".. కాదు.. "నా భర్తే నిత్య పెళ్లికొడుకు"