రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గంటకు సగటున 411 మంది వైరస్ బారిన పడుతుండగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఐదు రోజుల్లోనే (ఏప్రిల్ 22-26) 56,738 కేసులొచ్చాయి. ఈ నెల మొదట్లో 50 వేల కేసులు నమోదయ్యేందుకు 17 రోజుల(1-17) సమయం పట్టింది. రాష్ట్రంలో ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 9,881 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. మహమ్మారి బారినపడిన వారిలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురేసి, గుంటూరు, కడప, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురేసి, ప్రకాశంలో ఇద్దరు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 74,041 నమూనాల్ని పరీక్షించగా, 13.34 శాతం మందికి కరోనా ఉన్నట్లు తేలింది. మొత్తం కేసులు 10,43,441కు, మరణాలు 7,736కు చేరాయి. నెల్లూరు, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో తాజాగా వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కిందటి రోజు(12,634 కేసులు, 69 మరణాలు)తో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా కేసులు, మరణాల్లో కాస్త తగ్గుదల కనిపించింది. మార్చి ఆఖరు వరకూ ఓ మోస్తరుగా నమోదైన కేసులు ఏప్రిల్ 1 నుంచి నెమ్మదిగా పెరిగాయి. 15 తర్వాత ఉద్ధృతమయ్యాయి. వైరస్ వ్యాప్తి వేగం, తీవ్రత బాగా పెరిగాయి. క్రియాశీలక కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది. ఈనెల 1కి రాష్ట్రంలో 8,142 క్రియాశీలక కేసులుండగా.. సోమవారానికి ఆ సంఖ్య 95,131కు చేరింది. ఈ వ్యవధిలో క్రియాశీలక కేసుల్లో 1,068.34 శాతం పెరుగుదల నమోదైంది.
సగం కేసులు 4 జిల్లాల్లోనే...
* రాష్ట్రంలో 24 గంటల్లో నమోదైన కేసుల్లో 4,972 (50.31 శాతం)... నెల్లూరు (1,592), తూర్పుగోదావరి (1,302), గుంటూరు (1,048), విశాఖపట్నం (1,030) జిల్లాల్లోనే వచ్చాయి.
* పశ్చిమగోదావరి మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది.
* రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 4,431 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
* ఇప్పటివరకూ 1,60,68,648 నమూనాల్ని పరీక్షించారు.
ఇదీ చదవండి