ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 95 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కొవిడ్ నుంచి 179 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,432 పాజిటివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 27,233 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
Omicron Cases in India: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటింది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్ బాధితుల్లో ఇప్పటివరకు 77 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది.
యావత్ ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దేశంలోనూ శరవేగంగా వ్యాపిస్తోంది. చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలకు పాకగా.. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దారినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 54, దిల్లీలో 54 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు వెలుగుచూసినట్లు తెలిపింది. ఒడిశాలో కూడా రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 202గా ఉంది. అయితే ఈ వేరియంట్ బాధితుల్లో ఇప్పటివరకు 77 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది.
దేశంలో కరోనా కేసులు
India Covid cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 5,326 కేసులు నమోదయ్యాయి. మరో 453 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 79,097కు తగ్గింది.
దేశంలో టీకా పంపిణీ శరవేగంగానే కొనసాగుతోంది. సోమవారం 64,56,911 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,38,34,78,181కు చేరింది.