New Collectorates: కొత్త జిల్లా కేంద్రాల్లో నూతన కలెక్టరేట్ల నిర్మాణానికి రహదారులు, భవనాలశాఖ ఆకృతులను (డిజైన్లు) సిద్ధం చేసింది. ప్రస్తుతం వివిధ జిల్లాల్లోని కలెక్టరేట్లు, తెలంగాణలో నిర్మిస్తున్న కలెక్టరేట్ల భవనాలను పరిగణనలోకి తీసుకుని కొత్త వాటికి ప్రతిపాదనలు తయారు చేశారు. ఒక్కో కలెక్టరేట్‌కు 5 నుంచి 20 ఎకరాల భూమి అవసరమవుతుందని భావిస్తున్నారు. అందులో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలను నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. కడపలో 4.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, శ్రీకాకుళంలో 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు ఉన్నాయి. తెలంగాణలోని కొత్త జిల్లాలంతటా ఒకే విధమైన కలెక్టరేట్లను నిర్మిస్తున్నారు. అవి 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 17 శాఖల కార్యాలయాల ఏర్పాటుకు అనుగుణంగా ఉన్నాయి. మన వద్ద సగటున రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 శాఖల కార్యాలయాలు ఉండేలా రూపకల్పన చేశారు.
* అధికారులు 3 రకాల ఆకృతులను రూపొందించారు. వీటిలో సీఎం వద్ద ఆమోదం లభించే ఆకృతితో అన్ని చోట్లా ఒకేలా కలెక్టరేట్ల నిర్మాణం ఉంటుందని చెబుతున్నారు. ఒక్కో కలెక్టరేట్ నిర్మాణానికి రూ.70 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఆయా జిల్లా కేంద్రాల్లో స్థల లభ్యతను బట్టి భవనాల అంతస్తులు ఉంటాయని, తక్కువ స్థలముంటే ఎక్కువ అంతస్తులు, 15-20 ఎకరాలుంటే విశాలమైన భవనాలను నిర్మించే వీలుందని పేర్కొంటున్నారు.
* కొత్త జిల్లాల్లో... జిల్లా పోలీసు కార్యాలయాల (ఎస్పీ కార్యాలయం) నిర్మాణానికి 5 నుంచి 10 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. ఇందులో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాల నిర్మాణం ఉంటుందని, దాదాపు రూ.10 కోట్ల వరకు అవసరం అవుతుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లో ఉండాలి: సీఎం జగన్