కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చే 2011 కౌలు రైతుల చట్టాన్ని సవరించే ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో కౌలు రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా 2011 ఆంధ్ర ప్రదేశ్ భూ అధీకృత రైతుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గ్రామసభలో గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, 2011 అధీకృత రైతుల చట్టంలోని భూ యజమాని అనుమతి, కౌలు ఒప్పంద పత్రం, పట్టాదారు పాసుపుస్తకం, భూమి డాక్యుమెంట్లు, భూమి శిస్తు రసీదులు తదితర అంశాలు అడగకుండా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేయాలని కోరారు. సొంత భూమి ఉండి కొంత భూమి కౌలుకు సాగుచేస్తున్న వారికి కౌలు రైతుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. సాగు చెయ్యని వారికి పంట రుణాలు ఇచ్చే విధానాన్ని ఆపాలని... రాష్ట్రంలో ప్రాంతాల వారీగా, పంటల వారీగా వివిధ సమయాల్లో సాగు ఉంటుందన్నారు. కాబట్టి కార్డుల మంజూరు నిరంతరాయంగా ఉండాలని చెప్పారు. 2011 చట్టాన్ని సమగ్రంగా అమలు చేయకుండా ఆటంకాలు సృష్టిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... విశాఖలో జేడీ ఫ్యాషన్ షో కిర్రాక్