అమరావతిలో మంత్రి యనమల అధ్యక్షతన తెదేపా మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించారు. రైతులకు అందించే 9 గంటల ఉచిత విద్యుత్‌ను 12 గంటలకు పెంచే యోచనలో చర్చిస్తున్నారు. ఎస్సీ ఉపప్రణాళిక కాలపరిమితి పొడిగించేలా నిర్ణయం తీసుకునే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. మధ్యతరగతి, రైతులు, యువత, మహిళా సంక్షేమమే ప్రధాన అజెండాగా మేనిఫెస్టో రూపకల్పన చేయనున్నారు. రంగాల వారీగా ప్రతిపాదనలపై సమావేశంలో చర్చ జరుగుతోంది. సాయంత్రంలోగా మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చేలా యనమల కమిటీ కసరత్తు చేస్తోంది.
మేనిఫెస్టోపై కసరత్తు ?
యువత, మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం మేనిఫెస్టో రూపొందిస్తేంది. 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛను, మహిళలకు 55 సంవత్సరాలకు, యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రత్యేక యువజన విధానం రూపకల్పన కమిటీ ప్రతిపాదనలు చేయనుంది.
ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం అమరావతి ప్రజావేదికగా జరుగుతోంది. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 60 ఏళ్లకు తగ్గిస్తామని, మహిళలకు 55 ఏళ్లకే అందజేస్తామని కమిటీ ప్రతిపాదించనుంది. చంద్రన్న పెళ్లికానుక పథకం లబ్ధిదారులకు సంబంధిత చెక్‌తోపాటు, ఆ జంట కొత్త కాపురానికి అవసరమైన ఇంటి స్థలం లేదా ఇల్లు మంజూరు పత్రాలు, గ్యాస్ కనెక్షన్.. వంటివన్నీ పెళ్లిపీటల మీదే అందజేస్తామని పేర్కోనుంది. వివిధ రంగాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. మరో ఒకటి రెండు సమావేశాల తర్వాత ఎన్నికల ప్రణాళికకు తుదిరూపు ఇవ్వనుంది.
యువజనాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో పనిచేస్తోన్న కమిటీ యువత కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిచనుంది. దాన్ని పార్టీ మేనిఫెస్టోలోనే పొందరుపరచాలా లేదా విడిగా విడుదల చేయాలా అన్న విషయంలో ఇంకా నిర్ణయానికి రాలేదు. మేనిఫెస్టో కమిటీ యువతకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. యువత కోసం ప్రత్యేకంగా యువజన అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో యువజనాభివృద్ధి కార్యాలయం ప్రతిపాధనపై సమాలోచనలు చేస్తోంది. ప్రతి ప్రభుత్వ కళాశాలలోను ఉచిత వైఫై, పార్టీ కమిటీల్లో యువతకు పదవులు, వివిధ రంగాల్లో ఘనవిజయాలు సాధించిన యువతకు పురస్కారాలు, యువతకు ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్ కేంద్రాలు, గిరిజనులకు ఉచితంగా వ్యవసాయ ఉపకరణాలు వంటి మేనిఫెస్టోలో పొందుపర్చనున్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేంత వరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నారు. గిరిజనుల్ని వ్యవసాయంవైపు ఆకర్షించేందుకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఉపకరణాల అందజేయడం, పంట ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వడం, సకాలంలో కొనుగోలుకు చర్యలు, మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం విస్తృతం చేయడం, బియ్యం ఆధారిత ఆహారశుద్ధి యూనిట్లకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం, చిరుధాన్యాలు, వేరుసెనగ నుంచి ఆహారోత్పత్తులు తయారుచేసే పరిశ్రమల్ని ప్రోత్సహించడం ద్వారా ఈ పంటలకు మార్కెట్‌లో మెరుగైన ధరలు లభించేలా చర్యలు, ఇచ్ఛాపురం- తడ తీరప్రాంతంలో ప్రతి 50 నుంచి 100 కి.మీ.లకు ఫిషింగ్ జెట్టీల నిర్మాణం. తుపానులు సంభవించినప్పుడు మత్స్యకారులు వేగంగా ఒడ్డుకి చేరుకునేలా ఏర్పాటు చేసే కార్యక్రమాలు మేనిఫెస్టోలో పొందుపర్చనున్నారు.
డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయానికి ఉద్దేశించిన పసుపు-కుంకుమ పథకం భవిష్యత్తులోను కొనసాగింపు, బీసీ యువతకు రాయితీపై వాహనాలు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత పదేళ్లు పొడిగింపు వంటివి మేనిఫెస్టోలో పొందుపర్చనున్నారు. ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల, దళితతేజం, నారా హమారా సభల్లో ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలోకి చెరువుల పునరుద్ధరణ, 5నదుల అనుసంధానంతో మహాసంగమం వంటివి పేర్కోన్నారు.