విజయనగరం జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వరంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ముందుకు వచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద ఆ సంస్థ 2 కోట్ల రూపాయల నిధులను కేటాయించనుంది. ఈ మేరకు కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, బీడీఎల్ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాలపై బీడీఎల్ సంస్థ జనరల్ మేనేజర్ ఎస్.నారాయణన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం సభ్యులు కలెక్టర్ కార్యాలయంలో సంతకాలు చేశారు.
జిల్లాలో 11 సాంఘిక హాస్టళ్లలో వసతుల మరమ్మతులు, సదుపాయాల మెరుగుదలకు ఈ నిధులను వినియోగించనున్నట్టు కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ తెలిపారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆయా జిల్లాలకు ప్రభుత్వ రంగ సంస్థలను జతచేసి మౌలిక వసతుల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు మంజూరు చేస్తోందని కలెక్టర్ తెలిపారు.
"భారత్ డైనమిక్స్ లిమిటెడ్ .. రక్షణ విభాగ పరికరాలను తయారు చేస్తోంది. కార్బొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా విజయనగరం జిల్లాను ఎంచుకున్నాం. మా సంస్థ నుంచి సీఎస్ఆర్ నిధులను జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు అందించనున్నాం. ఆ మేరకు జిల్లా కలెక్టర్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నాం"
- నారాయణన్, బీడీఎల్ సంస్థ జనరల్ మేనేజర్
ఇదీ చదవండి : వివేకా వాచ్‌మన్‌కు నార్కో అనాలసిస్ పరీక్షకు కోర్డు అనుమతి