చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాలలో రీపోలింగ్ వివాదాస్పదంగా మారింది. ఎన్నికల విధులతో సంబంధం లేని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం రీపోలింగ్‌కు సిఫార్సు చేయటం వివాదానికి కారణమైంది. వైకాపా నేత చెవిరెడ్డి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవాలని సీఎస్ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కోరారు. ఈ మేరకు సీఎస్ ఓఎస్డీ ద్వివేదికి రాసిన లేఖ కలకలం రేపుతోంది. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచనల మేరకు ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది చంద్రగిరిలో రీపోలింగ్ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారని తెలుగు దేశం నేతలు ఆరోపిస్తున్నారు.
రీపోలింగ్ చేయాలంటూ సీఎస్‌ను... చెవిరెడ్డి ఈ నెల ఆరో తేదీన కోరారు. చెవిరెడ్డి ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలన్నది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆకాంక్షగా ఆయన ఓఎస్డీ ద్వివేదికి లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం జోక్యం స్పష్టంగా కన్పిస్తోందంటూ తెదేపా ఆరోపిస్తోంది. పోలింగ్ ముగిసిన 34 రోజుల తర్వాత రీపోలింగ్ జరపడం విడ్డూరంగా ఉందని తెదేపా నేతలు మండిపడుతున్నారు. సీఈఓకు ఫిర్యాదు చేయకుండా సీఎస్ వద్దకు చెవిరెడ్డి ఎందుకెళ్లారంటూ తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు. తనకు సంబంధం లేని వ్యవహారంలో సీఎస్ ఎందుకు జోక్యం చేసుకున్నారంటూ తెదేపా నిలదీసింది.
ఇవీ చదవండి..