పలమనేరులో తెదేపా తిరుగుబాటు అభ్యర్థి సుభాష్‌చంద్రబోస్, పోలవరంలో వంకా కాంచనమాల, మాచర్లలో చలమారెడ్డి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తాడికొండలో బెజ్జం సాయి ప్రసాద్, రాజోలులో బత్తుల రాము, పుట్టపర్తిలో గంగన్న, గాజువాకలో లేళ్ల కోటేశ్వరరావు, చీపురుపల్లిలో త్రిమూర్తులురాజు పోటీ నుంచి వెనక్కు తగ్గారు.
కల్యాణదుర్గంలో హనుమంతరాయచౌదరిని సీఎం చంద్రబాబు ఊరడించారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. చౌదరితోచర్చించి నామినేషన్ వెనక్కి తీసుకొనేలా చేశారు. విజయవాడ పశ్చిమలో వైకాపా రెబల్ అభ్యర్థి ఎంఎస్ బేగ్ తన నామినేషన్ ఉపసంహరించుకొని తెదేపాలో చేరారు. చిలకలూరిపేటలో జనసేన రెబల్ అభ్యర్థి పెంటేల బాలాజీ నామినేషన్ ఉపసంహరించుకొని తెదేపాలో చేరారు.
జనసేన తరపున పోటీచేస్తున్న ఎస్పీవై రెడ్డిని బుజ్జగించేందుకు తెదేపా తరఫున టీజీ వెంకటేశ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నంద్యాల లోక్‌సభకు ఎస్పీవైరెడ్డి, నంద్యాల అసెంబ్లీకి ఆయన అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి, శ్రీశైలంలో కుమార్తె సుజల, బనగానపల్లెలో మరో కుమార్తె అరవిందరాణి పోటీలో నిలిచారు. వైకాపా తరపున విశాఖ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో అయిదుగురు తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మదనపల్లి, తాడికొండ, రంపచోడవరంలో తెదేపా తిరుగుబాటు అభ్యర్థులు బరి నుంచి తప్పుకోలేదు. అరకు, పాడేరులో వైకాపాకు ఇద్దరేసి చొప్పున రెబెల్స్ బరిలో నిలిచారు. మాడుగులలో వైకాపాకు..అరకు, అనకాపల్లిలో జనసేనకు తిరుగుబాట్ల బెడద తప్పలేదు.