అవాంతరాలు దాటి...
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ విషయంలో ఈవీఎంలు మొరాయించినా ఓటర్లు లెక్క చేయలేదు. ఓటెత్తిన చైతన్యంతో ఏమాత్రం ఇబ్బందులు లెక్కచేయకుండా హక్కు వినియోగించుకున్నారు. చాలా కేంద్రాల్లో గంటల కొద్దీ ఈవీఎంలు మొరాయించినా ఓపికతో ఓటేసి వెళ్లారు. అందుకే 2014తో పోల్చుకుంటే ఈసారి 25లక్షలు అధికంగా ఓట్లు నమోదయ్యాయి. గెలుపోటముల లెక్కల్లో బిజీగా ఉన్న వారంతా... ఈ ఓటర్ల మది ఎటు మీటిందోనన్న అంచనాలు వేసుకుంటున్నారు.
రాష్ట్రంలో 2014 ఎన్నికలతో పోలిస్తే 2019లో 1.68 శాతం మేర అధికంగా పోలింగ్ నమోదైంది. మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాలకు 2014 ఎన్నికల్లో 77.96 శాతం పోలింగ్ నమోదు కాగా... ప్రస్తుత ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ జరిగింది.
కదిలిన మహిళా లోకం...
రాష్ట్రంలో పోలైన ఓట్లలోనూ పురుషుల కంటే 2లక్ష 35వేల 398 మంది మహిళల ఓట్లు అధికంగా ఉన్నాయి. పోలైన ఓట్లలో 50.37 శాతం ఓట్లు మహిళలవి కాగా...49.63 శాతం ఓట్లు పురుషులవి. ప్రకాశం జిల్లా అద్దంకిలో రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, ప్రకాశం జిల్లా దర్శి నిలిచాయి. అతి తక్కువ పోలింగ్ నమోదైన నియోజకవర్గాల్లో విశాఖ-పశ్చిమం మొదటి స్థానంలో ఉంటే... విశాఖ-తూర్పు, విశాఖ -దక్షిణ, పాడేరు, విశాఖ-ఉత్తరం, కడప తదితర నియోజకవర్గాల పరిధిలో తక్కువ పోలింగ్‌శాతం నమోదైంది.
జిల్లాల వారీగా చూసుకుంటే శాతాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా | 75.14శాతం |
విజయనగరం జిల్లా | 80.68 శాతం |
విశాఖ జిల్లా | 71.81శాతం |
తూర్పుగోదావరి జిల్లా | 80.08 శాతం |
పశ్చిమగోదావరి జిల్లా | 82.19శాతం |
కృష్ణా జిల్లా | 81.12 శాతం |
గుంటూరు జిల్లా | 82.37శాతం |
ప్రకాశం జిల్లా | 85.93 శాతం |
నెల్లూరు జిల్లా | 76.68శాతం |
అనంతపురం జిల్లా | 81.90 శాతం |
కర్నూలు జిల్లా | 77.68శాతం |
చిత్తూరు జిల్లా | 81.03 శాతం |
కడప జిల్లా | 77.21 శాతం |
ప్రముఖుల ఇలాఖాలో ఇలా...
- సీఎం చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో 1.6 శాతం మేర పోలింగ్ పెరిగింది. 2014లో 83.8% ఉండగా... ఈసారి 85.4 శాతానికి చేరింది.
- జగన్ నియోజకవర్గం పులివెందులలో గత ఎన్నికల్లో 79.8 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 80.8 శాతానికి చేరుకుంది.
- పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 64.6 నమోదు కాగా... ఈసారి 65.3కు చేరింది.
- పవన్ కల్యాణ్ పోటీ చేసిన మరో నియోజకవర్గం భీమవరంలో గత ఎన్నికల్లో 77.68 నమోదు కాగా... ఈసారి 77.60కు పడిపోయింది.