తాత్కాలిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టారు. వివిధ రంగాలకు ఈ ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వం కేటాయించిన నిధుల గురించి వివరించారు.
పశువులు, చేపల పెంపకం రంగానికి ప్రభుత్వ మద్దతు అవసరమని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కు నిధుల కేటాయింపును పెంచి ఈ ఒక్క ఆర్థిక సంవత్సరానికే 750కోట్ల రూపాయలను కేటాయించినట్లు ప్రకటించారు.
గోమాత సంరక్షణకు 'రాష్ట్రీయ కామ్ధేనూ ఆయోగ్'ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మత్స్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులకు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డును చేపల పెంపకందారులకూ వర్తింపజేస్తామన్నారు.
సహజ విపత్తులు సంభవించినప్పుడు రైతులు పంట రుణాలను తిరిగి చెల్లించలేక పోతున్నారని గోయల్ తెలిపారు. సాధారణ జాతీయ విపత్తుకు ప్రస్తుతం రెండు శాతం వడ్డీ రాయితీ పొందుతున్న రైతులు అదనంగా మరో 3శాతం రాయితీ పొందుతారని వెల్లడించారు.
"పశువుల పెంపకం, చేపల ఉత్పత్తి రంగాలకు ప్రభుత్వ మద్దతు అవసరం. రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కు ఈ ఒక్క ఆర్ధిక సంవత్సారానికే రూ.750 కోట్లు కేటాయించాం. 'రాష్ట్రీయ కామ్ధేను ఆయోగ్'ను ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. గోవుల జన్యుపరమైన వనరులు కాపాడటం, గోవుల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. గోమాత రక్షణ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయదు. అవసరమైన అన్ని చర్యలు చేపడుతుంది. చేపల ఉత్పత్తిలో భారత దేశం ప్రపంచంలో రెండో స్ధానంలో ఉంది. ఈ రంగంలో క్షేత్ర స్థాయిలో 1.45 కోట్ల మంది జీవనోపాధి పొందుతున్నారు. మత్స్య రంగం అభివృద్ధికై ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. సహజ విపత్తులు సంభవించినపుడు రైతులు పంట రుణాలను తిరిగి చెల్లించలేకు పోతున్నారు. ప్రస్తుతం ఉన్న 2శాతంవడ్డీ రాయితీని పెంచుతాం"
-పీయూష్ గోయల్, ఆర్ధిక మంత్రి