పండు వెన్నెల్లో వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం - Vontimitta ramulavaari kalyanam - VONTIMITTA RAMULAVAARI KALYANAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 23, 2024, 12:46 PM IST
Vontimitta Sri Kodanda Rama kalyanam : ఆంధ్ర భద్రాదిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వైఎస్సార్ జిల్లా రామాలయంలో పండు వెన్నెల్లో నిండు చంద్రుడు కనులారా వీక్షించే విధంగా సీతారాముల కళ్యాణం కనుల విందుగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని టీటీడీ వేద పండితుల సమక్షంలో కనుల పండువగా జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం: రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్ వలవన్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. టీటీడీ తరపున కార్య నిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి రూ.31 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అందజేశారు. పరిణయ ఘట్టం నయనానందకరంగా సాగింది. ప్రధాన వేదికను ఫల, పుష్ప, పత్రాలతో మనోహరంగా తీర్చిదిద్దారు. రెండు గంటల పాటు సాగిన కళ్యాణ మహోత్సవానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంతకుముందు రామయ్య క్షేత్రం నుంచి కల్యాణవేదిక వరకు కనులపండువగా శోభాయాత్ర సాగింది. చతుర్దశి తిథి రాత్రివేళ కల్యాణాన్ని నిర్వహించడం ఒంటిమిట్ట రామలయం ప్రత్యేకత.