తనపై ఉన్న కేసుల వివరాలివ్వాలని కోరుతూ డీజీపీకి చంద్రబాబు లేఖ - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 1:22 PM IST
TDP Chief Chandrababu Letter to DGP: నామినేషన్‌లో పొందుపరిచేందుకు తనపై కేసుల వివరాలివ్వాలని డీజీపీ(DGP)కి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) నిబంధనల ప్రకారం ఎన్నికల్లో(AP Elections 2024) పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉన్నందున ఈ వివరాలు కోరుతున్నట్లు తెలిపారు. 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై పలు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న కారణంగా కేసులు పెట్టారన్న చంద్రబాబు ఇలాంటి సందర్భాల్లో సంబంధిత ఏజెన్సీలు, అధికారులు తనపై పెట్టిన కేసుల విషయంలో తనకు సమాచారం ఇవ్వలేదని విమర్శించారు.
ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా ఈ వివరాలు తెలియజేయాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తాను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందడం అనేది ఆచరణ సాధ్యం కాదన్న ఆయన డీజీపీ కార్యాలయం ద్వారా కేసుల విషయంలో సమాచారం ఇవ్వాలని కోరారు. డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ(ACB), సీఐడీ(CID) విభాగాలకు కూడా లేఖ పంపారు. రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందనే అనుమానంతో ముందుగానే లేఖ రాసి వివరాలు కోరినట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియలో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టేలా లేఖ ద్వారా సమాచారం కోరారు. సమాచారం లేని కేసుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు.