టీటీడీకి నాణ్యత లేని నెయ్యి సరఫరా - గుత్తేదారు సంస్థపై చర్యలు - poor quality ghee supply to ttd
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 10:39 AM IST
Poor Quality Ghee Supply to TTD: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేస్తున్న తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ‘ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. నెయ్యి సరఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించని గుత్తేదారుపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది. తమిళనాడులోని దుండిగల్ నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు బ్లాక్ లిస్టులో పెడతామంటూ నోటీసులు జారీ చేసింది. 8.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్న ఏఆర్ సంస్థ ఇప్పటివరకు 68 వేల కిలోల నెయ్యిని సరఫరా చేసింది.
ఏఆర్ సంస్థ నుంచి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను పరిశీలించగా, ఇతర నూనెలు కల్తీ చేసినట్లు వెల్లడైంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ప్రయోగశాలకు పంపి నాణ్యత పరిశీలించడంతో లోపాలు బయటపడినట్లు ఈవో శ్యామలరావు వెల్లడించారు. లడ్డూ ప్రసాదాలు నాణ్యంగా, రుచికరంగా ఉండాలనే లక్ష్యంతో ఈవో జె.శ్యామలరావు సదరు సంస్థపై చర్యలకు ఉపక్రమించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని నెయ్యి సరఫరాదారులకు సూచించినా తీరు మారకపోవడంతో చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు.