అమిత్ షాకు రామచంద్రయాదవ్ లేఖ - టీటీడీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు విజ్ఞప్తి
🎬 Watch Now: Feature Video
BCY Party Leader Ramachandra Yadav Letter to Amit Shah: టీటీడీలో జరుగుతున్న అక్రమ వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ లేఖ రాశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని ఆరోపించారు. హైందవేతర కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తూ హిందూ విశ్వాసాలను పక్కన పెట్టారని ఆయన ఫిర్యాదు చేశారు. గతంలో ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణ దీక్షితులు విడుదల చేసిన వీడియోతో టీటీడీలో జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం జగన్ పాలనలో తిరుమలలో అనుమానాస్పద వ్యవహారాలు, ఆలయ ప్రాంగణంలో అన్యమతస్థుల ప్రమేయం పెరిగిందని లేఖలో ప్రస్తావించారు.
రమణ దీక్షితులు విడుదల చేసిన వీడియోను సాక్ష్యంగా తీసుకుని సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన అమిత్‌షాను కోరారు. శ్రీవారి పోటు వద్ద అనుమానాస్పదంగా తవ్వకాలు చేపడుతున్నారు. అక్కడ గుట్కా ప్యాకెట్లు పడేస్తున్నారని పేర్కొన్నారు. క్రైస్తవుడైన ఈవో ధర్మారెడ్డి స్వామి వారి సేవకులుగా అన్యమతస్తులను నియమిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ చర్యలన్నీ ఆలయ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుని భక్తుల్లో నమ్మకాన్ని కలిగించాలని ఆయన లేఖలో విన్నవించారు.