YSRCP Victims Complaint to TDP Leaders about Anarchy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్సార్సీపీ బాధితులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆ బాధితుల కోసం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ప్రతిరోజు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అంతేకాకుండా చాలా సమస్యలను అప్పటికప్పుడే అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరిస్తున్నారు. శుక్రవారం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ. షరీఫ్ ఫిర్యాదులు స్వీకరించారు.
తన పొలానికి వెళ్లడానికి మా భూముల్లోంచి దారి కావాలని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అండతో ఆ పార్టీ నాయకుడు రాటకొండ సుబ్బారాయుడు తనను పోలీసులతో కొట్టించారని అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలోని తిమ్మయ్యగారిపల్లెకు చెందిన హరిబాబుతో పాటు పలువురు గ్రామస్థులు టీడీపీ నేతలకు ఫిర్యాదు చేశారు. నాటి తహసీల్దార్‌తో పాటు పోలీసులు కూడా సుబ్బారాయునికే సహకరించారని, వారి ఒత్తిడితో గతంలో ఓ కుటుంబం సైతం ఆత్మహత్య చేసుకుందని వాపోయారు.
బతుకు దెరువు కోసం ఊరు విడిచి వెళితే గ్రామంలోని తన 3.37 ఎకరాల భూమిని కబ్జా చేశారని ప్రకాశం జిల్లాలోని కోవిలంపాడుకు చెందిన లక్ష్మీ అనే మహిళ వాపోయారు. టీడీపీ హయాంలో నిర్మించిన బాలికల వసతి గృహం, ఐటీఐ కళాశాలకు ఐదేళ్లుగా సిబ్బందిని కేటాయించకుండా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అడ్డుకున్నారని నరసారావుపేటకు చెందిన పలువురు ముస్లింలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో టైలరింగ్ వృత్తి దీనస్థితికి చేరుకుందని, తమను ఆదుకోవాలని టైలర్ ఫెడరేషన్ మాజీ ఛైర్మన్ స్వామి వినతిపత్రం అందజేశారు.
వైఎస్సార్సీపీ నాయకుడి దుశ్చర్య - అప్పు తీర్చమన్నందుకు దాడి
ప్రజావేదికకు వెల్లువెత్తిన వినతులు - అన్నీ వైఎస్సార్సీపీ నేతల అరాచకాలపైనే!