YSRCP Leaders Constructions at Bheemili Beach: వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక విశాఖలో విలువైన ప్రభుత్వ స్థలాలు, కొండలు కొల్లగొట్టారు. అయినా ఆయన భూదాహం తీరలేదు. ప్రస్తుతం ఆ నేత కబ్జాలో భీమిలి సాగర తీరం నలిగి పోతుంది. తన కుటుంబానికి చెందిన సంస్థ పేరుతో సీఆర్‌జెడ్ (Coastal Regulation Zone) పరిధిలో అక్రమ నిర్మాణాలకు దర్జాగా తెర తీశారు. రౌడీ మూకల పహారాలో ఇసుక తిన్నెలు ధ్వంసం చేసి, గ్రావెల్‌తో పూడ్చి కాంక్రీట్‌తో నిర్మాణాలు సాగిస్తున్నారు. అడ్డుగా ఉన్న గెడ్డలను సైతం పూడ్చి వేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు.
వైసీపీ ఉత్తరాంధ్ర మాజీ ప్రాంతీయ ఇన్ఛార్జి విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి, కుమార్తె నేహా రెడ్డి భాగస్వామ్యంగా ఉన్న అవ్యాన్ రియల్టర్స్ భీమిలి-భోగాపురం బీచ్ రోడ్డులో కొంత కాలం కిందట విలువైన స్థలాలు కొనుగోలు చేసింది. మొదట కొందరు బినామీల పేరుతో స్థలాలు కొనుగోలు చేసి, ఆ తర్వాత అవ్యాన్ రియల్టర్స్ పేరుపైకి బదలాయించుకున్నారు. భీమునిపట్నంలో అవ్యాన్ పేరిట భూములు సొంతం చేసుకున్నారు. కొంత స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు.
భీమిలి బీచ్ సమీపంలో శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం
విశాఖ నగరపాలక సంస్థ 3వ వార్డు పరిధిలోకి వచ్చే ఈ సముద్ర తీరప్రాంతంలో సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు మొదలు పెట్టారు. సముద్ర మట్టానికి కేవలం 30 గజాల దూరంలో శాశ్వత గోడను కాంక్రీట్‌తో నిర్మించారు. ఇసుక తిన్నెలను అర్ధరాత్రి సమయంలో జేసీబీలతో తొలగించి, నిర్మాణాలకు అనువుగా గ్రావెల్‌తో పూడుస్తున్నారు. ఇక్కడ విజయసాయి రెడ్డి తన కుమార్తె పేరుతో ఓ స్టార్ హోటల్ నిర్మించాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ప్రహరీ నిర్మాణ సమయంలో చాకిరేవు గెడ్డను కూడా 50 శాతం పూడ్చేశారు. ఈ ప్రైవేటు నిర్మాణాల వద్ద జీవీఎంసీ బోర్డు పెట్టి 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' అని రాశారు. ఎవరూ ప్రశ్నించకుండా ఈ తంతుకు తెగబడ్డారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికారులు ఆఘమేఘాలపై వెళ్లి బోర్డు తొలగించారు కానీ, ఉల్లంఘిస్తూ చేస్తున్న పనులను కన్నెత్తి చూడలేదు. సీఆర్‌జెడ్ పరిధిలోకి వచ్చే సముద్ర తీరం నుంచి 500మీటర్ల వరకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ, కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథార్టీల అనుమతులు పొందకుండా కాంక్రీట్ నిర్మాణాలు చేయకూడదు.
విశాఖలో అవినీతి అనకొండ వాటా ₹2వేల కోట్లు- పేదల భూముల క్రమబద్ధీకరణకు మాస్టర్ ప్లాన్
సీఆర్‌జెడ్ పరిధిలో ఇసుక తిన్నెలను కదిలించకూడదు. అయితే సదరు నేత గ్యాంగ్ దర్జాగా నిబంధనలు ఉల్లంఘించింది. భీమిలి పరిధిలో తీరం వెంబడి అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలు యథేచ్చగా జరిగిపోతున్నాయి. మంగమారిపేట సమీపంలో ఓ వైసీపీ నేత కొంత ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి, సమీపంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. వైసీపీ నేత సైతం విజయసాయిరెడ్డి అనుచరుడిగా చెప్పుకొంటూ బండరాళ్లు వేసి బీచ్ కప్పేస్తున్నారు.
విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలలకే తెన్నేటి పార్కు నుంచి భీమిలి వరకు సాగర తీరంలో సీఆర్‌జెడ్ ఉల్లంఘనల పేరిట కొన్ని నిర్మాణాలను తొలగించారు. కొన్ని శాశ్వత కట్టడాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతల తర్వాత కొందరు బాధితులు వైసీపీలో చేరారు. ఇలా చేరి పెద్దలకు వాటా ఇచ్చాక అదే స్థలంలో మళ్లీ తిరిగి కట్టుకునేలా అనుమతిచ్చారనే ఆరోపణలున్నాయి. అప్పుడు సీఆర్‌జెడ్ నిబంధనల పేరుతో పలు నిర్మాణాలను తొలగించిన విజయ సాయిరెడ్డి, ఇప్పుడు సొంతవారి కోసం నిర్మాణాలు ఎలా చేపడుతున్నారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అనాథాశ్రమాల నుంచి ప్రార్థనాలయాల వరకూ - వారి కన్ను పడితే అంతే!