YSRCP Planned School in Pond in Pedana : "నాడు-నేడు" అంటూ గత ప్రభుత్వం చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. పెడనలో కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ బడిని తీర్చిదిద్దుతామని చెప్పి ఉన్న భవనాలను కూల్చేశారు. కమీషన్ల కక్కుర్తి కోసం పిల్లల భద్రతను పణంగా పెట్టి ఏకంగా చెరువులోనే బడి నిర్మాణం చేపట్టారు. దీనిపై హైకోర్టు స్టేతో పనులు నిలిచిపోయాయి. ఉన్న బడీ పోయి కొత్తదీ రాక ఒకే గదిలో విద్యార్థులు ఇరుక్కుని చదువుకోవాల్సిన దుస్థితి.
YSRCP Leaders Collapsed School In Krishna District : నాడు-నేడు అక్రమాలకు కృష్ణా జిల్లా పెడనలోని పాఠశాల సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. 4వ వార్డులో ఉర్దూ మిక్స్‌డ్ పాఠశాలను కూల్చివేసి కొత్త బడి కడతామంటూ భవనాన్ని నేలమట్టం చేశారు. కానీ స్కూల్‌ను అక్కడ కాకుండా చెరువులో కట్టేందుకు పూనుకున్నారు. 9 ఎకరాల తామర చెరువును కొంత పూడ్చి అక్కడే నిర్మాణాలు చేపట్టారు. స్థానికులు అభ్యంతరం చెప్పినా వినకుండా మాజీ మంత్రి జోగి రమేష్ 2022 ఆగస్టు 8న శంకుస్థాపన చేశారు. నాడు- నేడు కింద రూ. 55 లక్షలు కేటాయించగా వైఎస్సార్సీపీ నాయకుడే గుత్తేదారు అవతారమెత్తి మొదటి అంతస్తు వరకు కట్టారు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో టీడీపీ నేత అబ్దుల్ ఖయ్యూం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రమాదకరస్థితిలో చెరువులో పాఠశాల ఎలా కడతారంటూ హైకోర్టు స్టే ఇవ్వడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
హైకోర్టు స్టే తర్వాత వైఎస్సార్సీపీ నేతలు మరో కుట్రకు తెర లేపారు. తామర చెరువు సర్వే నంబరు మార్చాలని జోగి రమేష్ ద్వారా పావులు కదిపారు. కానీ అది ఫలించలేదు. గత కలెక్టర్ స్పందించకపోవడంతో భవన నిర్మాణం నిలిపివేయక తప్పలేదు. చెరువును పూడ్చి పాఠశాల భవనాన్ని నిర్మిస్తే భవిష్యత్తులో ముప్పు తప్పదని స్థానికులు చెబుతున్నారు.
'ఇల్లు పీకి పందిరేశారు!' - నాడు, నేడు పనుల్లో అంతులేని నిర్లక్ష్యం - Nadu Nedu School Works
'పిల్లల చదువుకు ఆటంకం కలగడంతో పొరుగున ఉన్న బడిలో ఒక గది కేటాయించారు. ఆ ఒక్క గదిలోనే ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు మధ్యాహ్న భోజనం. క్లాసులన్నీ ఒకేసారి జరగడంతో ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. అయినా పరస్థితులు మారడం లేదు.' -విద్యార్థుల తల్లిదండ్రులు
కూటమి ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి పెట్టి చెరువులో కాకుండా పాత పాఠశాల ఉన్న భవనంలోనే నిర్మాణాలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.